మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ తారామణి ఐశ్వర్యా రాయ్ గ్లామరస్ గా నటించిన తాజా సినిమా యే దిల్ హై ముష్కిల్… టైటిల్ కు తగ్గట్టే కష్టాల్లోపడింది. ఈ సినిమా విడుదల వివాదాస్పదంగా మారింది. యురీ ఉగ్రదాడుల తర్వాత పాకిస్తాన్ పై చెలరేగిన ఆగ్రహ జ్వాలలు ఈ సినిమాకు అనుకోని కష్టానికి కారణమయ్యాయి. పాకిస్తాన్ కళాకారులు నటించిన సినిమాలను ప్రదర్శించ వద్దని మహారాష్ట్ర నవ నిర్మాణసేనతో పాటు ఆ రాష్ట్రంలోని బీజేపీ నేతలు హెచ్చరించారు. ఐష్ తాజా సినిమాలో ఫవాద్ ఖాన్ అనే పాకిస్తాన్ నటుడు నటించాడు. అదీ సంగతి.
చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఫుల్ గ్లామర్ పాత్రలో ఐశ్వర్య నటించిన సినిమా ఇదే. ఆరాధ్య బచ్చన్ పుట్టిన తర్వాత నాలుగేళ్లు ఐష్ సినిమాలకు దూరంగా ఉంది. రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత విడుదలైన రెండు సినిమాల్లోనూ ఆమె చేసినవి గ్లామర్ పాత్రలు కాదు. యే దిల్ హై ముష్కిల్ లోమాత్రం యువ హీరోయిన్లతో పోటీ పడి గ్లామర్ ను ఒలకబోసిందట.
ఎం.ఎన్.ఎస్. హెచ్చరికల తర్వాత సింగిల్ థియేటర్ల యజమానులు ముంబైలో ఇటీవల సమావేశమయ్యారు. ఈ సినిమాను విడుదల చేయవద్దని నిర్ణయించారు. అంటే మహారాష్ట్ర, గోవా, గుజరాత్, కర్ణాటకల్లో ఈ సినిమా ప్రదర్శన జరగదన్న మాట. అయితే ఈ రోజుల్లో మల్టీప్లెక్స్ లదే హవా. కాబట్టి వాటిలో ఈ సినిమాను ప్రదర్శించ వద్దంటూ ఆందోళనలు మొదలయ్యాయి. బుధవారం ముంబైలోని పలు మల్టీప్లెక్స్ లలో ఎం ఎన్ ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సినిమాను విడుదల చేయవద్దని వినతిపత్రాలిచ్చారు. ప్రదర్శిస్తే బాగుండదని అనలేదుగానీ ముంబైలో ఆ భయం మాత్రం ఉంటుందనేది వాస్తవం.
రణబీర్ కపూర్ తో ఐశ్వర్య రొమాన్స్ సీన్లు ఆన్ లైన్లో హల్ చల్ చేశాయి. మరో హీరోయిన్ అనుష్క శర్మ కూడా ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టే రేంజిలో రణబీర్, ఐశ్వర్యల లవ్ సీన్లు కలకలం రేపాయి. అవి ఎంత హాటుగా, ఘాటుగా ఉన్నాయంటే చివరకు వాటిని సెన్సార్ బోర్డు కత్తిరించింది. మూడు హాట్ సీన్లను కట్ చేసి యు-ఎ సర్టిఫికెట్ ఇచ్చింది.
దీపావళి సందర్భంగా ఈనెల 28న ఈ సినిమాను విడుదల చేయాలని దర్శక నిర్మాత కరణ్ జోహార్ ప్లాన్ చేశాడు. అయితే ఇది విడుదల అవుతుందా, మహారాష్ట్ర ప్రభావం దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ పడి గొడవలు జరుగుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో తన సినిమాల్లో పాక్ కళాకారులను తీసుకోను, ఈసారికి వదిలెయ్యండని కరణ్ జోహార్ వీడియో ప్రకటనలో కోరాడు. అయినా ఫలితం కనిపించడం లేదు. ఇంతకీ ఐష్ సెకండ్స్ ఇన్నింగ్స్ లో గ్లామరస్ లుక్ తెరమీదికి వస్తుందా లేదా అని అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.