ఆంధ్రప్రదేశ్ ఐటీ , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. ఈ పర్యటన యొక్క ప్రధాన అజెండా రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణ, పెండింగ్లో ఉన్న విభజన హామీల సాధనపై చర్చిస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి కేంద్రం నుంచి చట్టబద్ధత కల్పించే అంశంపై హోంమంత్రితో లోకేష్ చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు.
అధికారికంగా ఏం చర్చించినా.. నారా లోకేష్ పర్యటన రాజకీయం కోసమేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికతో పాటు..ఏపీలో రాజకీయ పరిస్థితులు, చట్టాలను యథేచ్చగా ఉల్లంగిస్తున్న వైసపీ నేతల పై తీసుకోవాల్సిన చర్యలు, అలాగే దర్యాప్తులో ఉన్న అనేక కేసులకు సంబంధించిన పురోగతి వంటి అంశాలపై అమిత్ షాతో లోకేష్ చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
లిక్కర్ స్కామ్ కేసుతో పాటు లడ్డీ కల్తీ కేసుల్లోనూ ఈడీ విచారణ జరుపుతోంది.స్పష్టమైన మనీ ట్రయల్ ఈ కేసుల్లో ఉన్నందున సూత్రధారి బయటకు తెచ్చి ప్రజల ముందు నిలబెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో నారా లోకేష్ ఢిల్లీ పర్యటన తర్వాత ఏపీలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.


