సాధారణంగా ఆడియో రిలీజ్‌లూ, ప్రీ రిలీజ్‌లలో ఓ కామన్ డైలాగ్ వినిపిస్తుంటుంది. ‘నేను ఈ దర్శకుడితో మరో సినిమా చేస్తా’ అని హీరో, ‘నేను ఈ హీరోతో మరో సినిమా చేయబోతున్నా’ అని దర్శకుడు అవసరం ఉన్నా లేకపోయినా, సినిమా ఉన్నా లేకపోయినా – గొప్పలు చెప్పుకుంటారు. పబ్లిసిటీలో అదో భాగం. ‘మరో సినిమా చేయడానికి రెడీ అయ్యారంటే ఈ సినిమా ఎంత బాగొచ్చిందో’ అని జనాలు అనుకోవాలని.. ఓ మాట వదిలేస్తుంటారంతే.
‘ఆఫీసర్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఇలాంటి ముందస్తు ప్రకటనలేం వినిపించలేదు. నిజానికి… ‘ఆఫీసర్’ సెట్లో ఉండగానే – అఖిల్‌తో వర్మ ఓ సినిమా చేస్తాడని వార్తొచ్చింది. దానికి అటు అఖిల్, ఇటు వర్మ కూడా ‘ఓ.. యస్’ అనేశారు. ఈమధ్య ఇంటర్వ్యూలో కూడా ‘అఖిల్‌తో సినిమా ఉంటుంది’ అని వర్మ ప్రకటించాడు. అయితే ఆ సినిమాకి సంబంధించిన చిన్న ముక్క కూడా అటు అఖిల్, ఇటు వర్మ మాట్లాడలేదు. నిజంగా వీరిద్దరి కాంబోలో సినిమా ఉండి ఉంటే… ఆఫీసర్ ప్రీ రిలీజ్ వేడుకలో దాని గురించి కనీసం మాట వరసకైనా చెప్పేవారు. కానీ… అలాంటి అలికిడి ఏం వినిపించలేదు. అటు నాగ్ గానీ, ఇటు వర్మ గానీ ‘ఈ సినిమా బాగా వచ్చింది..’ అంటూ డబ్బాలు కొట్టుకోలేదు. ‘నేను చెప్పినట్టు తీశా’ అని వర్మ ‘సౌండ్ బాగుంటుంది, ఫైట్లు బాగుంటాయి’ అని నాగ్ చెప్పారు తప్ప – సినిమా గురించి లోతుల్లోకి వెళ్లలేదు. ఈ సినిమాపై ముందు నుంచీ ఎవరికీ నమ్మకాల్లేవు. సెన్సార్ రిపోర్టు కూడా అంతంతమాత్రంగానే వచ్చింది. నాగ్ ఈ సినిమాపై అసంతృప్తిగా ఉన్నాడని, అందుకే అఖిల్‌తో సినిమా ఆపేశాడని వార్తలొచ్చాయి. నిన్న జరిగిన ఈవెంట్లో వర్మ, నాగ్, అఖిల్ స్పీచులు వింటే – అది నిజమే అనిపిస్తోంది.