ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఐకానిక్ భవనాలు పూర్తయ్యేలసరికి… పూర్తి స్థాయిలో స్టార్ హోటల్స్ కూడా అందుబాటులోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. మూడు పెద్ద స్టార్ హోటల్స్ ప్రాజెక్టులకు భూమి పూజలు జరిగాయి. దసపల్లా, నోవోటెల్, తాజ్ వివాంతా – ఈ మూడు కలిపి సుమారు రూ. 620 కోట్ల పెట్టుబడి పెడుతున్నాయి.
రూ. 200 కోట్లతో 4-స్టార్ హోటల్‌ను దసపల్లా నిర్మిస్తోంది. రెండు ఎకరాల్లో వస్తున్న ఈ హోటల్ నుంచి నాలుగు వందలకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. 2028 చివరి నాటికి ఆపరేషన్స్ ప్రారంభం కానున్నాయి. రెండోది నోవోటెల్. లింగాయపాలెంలో రూ. 220 కోట్లతో 5-స్టార్ హోటల్ & కన్వెన్షన్ సెంటర్‌కు భూమి పూజ ఘనంగా జరిగింది. నాలుగు ఎకరాల్లో నిర్మాణం జరగనున్న ఈ ప్రాజెక్టు 2027 చివరి నాటికి పూర్తవుతుంది. అంతర్జాతీయ సదస్సులు, వ్యాపార సమావేశాలకు ఇది పెద్ద హబ్‌గా మారనుంది.
మూడోది తాజ్ వివాంతా. సెప్టెంబర్ 10న మందడం సీడ్ యాక్సెస్ రోడ్లో రూ.200 కోట్లతో 5-స్టార్ హోటల్ నిర్మాణం ప్రారంభమైంది. నాలుగు ఎకరాల్లో తాజ్ గ్రూప్ బ్రాండ్‌తో G.V. ఎస్టేట్స్ & హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టు చేపట్టింది. కన్వెన్షన్ సెంటర్ కోసం అదనంగా 2.5 ఎకరాలు కూడా కేటాయించారు. ఇది కూడా 2028 నాటికి రెడీ అవుతుందని సమాచారం.
ఇవి కాకుండా.. మరికొన్ని స్టార్ హోటల్స్ కు భూమి కేటాయించారు. త్వరలో వాటికి కూడా భూమిపూజ జరగనుంది. మూడేళ్లు పూర్తయ్యే సరికి ఇవన్నీ అందుబాటులోకి వస్తాయి.
