అమరావతి రాజధాని ప్రాంతంలో దశాబ్ద కాలంగా నలుగుతున్న భూసమీకరణ వ్యవహారంలో తాజాగా ఒక ఆసక్తికరమైన , సంచలన మలుపు చోటుచేసుకుంది. ఇన్నాళ్లూ రాజధాని నిర్మాణానికి తన భూమిని ఇవ్వనంటూ భీష్మించుకు కూర్చున్న నేలపాడు రైతు, అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకుని భూసమీకరణ కింద ప్రభుత్వానికి భూమిని అప్పగించారు. జగన్‌ను కలిసి..న్యాయపోరాటానికి అవసరమైన సాయం హామీని పొందినా వెంటనే ఒక్క రోజులోనే భూమిని సమీకరణకు ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
పన్నెండేళ్లుగా భూమి ఇవ్వని రైతు
అమరావతి రాజధాని కోసం భూములు ఇవ్వడానికి నిరాకరిస్తూ చట్టపరమైన పోరాటం చేస్తున్న సదరు రైతు, కాలంలో తనకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరించి, న్యాయసహాయం కోరేందుకు తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. రైతు గోడు విన్న జగన్, ఆయనకు అండగా ఉంటామని భరోసా ఇస్తూ.. కోర్టుల్లో లీగల్ పోరాటం చేయడానికి వీలుగా వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రముఖుడు, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని రంగంలోకి దించుతానని, ఆయనతో న్యాయసాయం ఇప్పిస్తానని రైతుకు మాట ఇచ్చారు.
పొన్నవోలు భయమే కారణమా?
జగన్ మోహన్ రెడ్డి చేసిన ఈ ప్రకటన సదరు రైతులో ఊరట కలిగించడానికి బదులు ఒక రకమైన ఆందోళనను, భయాన్ని సృష్టించినట్లుగా ఉంది. ఆయన వాదించే సామర్థ్యం గురించి బాగా తెలుసు కాబట్టి అటూ ఇటూ కాకుండా పోవడం కన్నా.. సమీకరణకు భూమి ఇచ్చి బయటపడటం మంచిదని ఆ రైతు అనుకున్నారు. పొన్నవోలు రంగంలోకి దిగితే తన భూమి శాశ్వతంగా వివాదాల్లో చిక్కుకుపోతుందనే సైకలాజికల్ ఫోబియా రైతులో బలపడింది. అందుకే సమీకరణకు భూమి ఇచ్చేశారు.
మిగిలిన రైతులదీ అదే దారి
ఈ పొన్నవోలు సాయం భయం వల్లనో ఏమో కానీ.. జగన్‌ను కలిసిన మరుసటి రోజే ఆ రైతు యుద్దప్రాతిపదికన స్పందించి, తన లీగల్ పోరాటాలన్నింటికీ స్వస్తి పలికారు. ఉదయమే రాజధాని ప్రాంత అథారిటీ అధికారుల వద్దకు వెళ్లి, భూసమీకరణ కింద తన భూమిని రాజధాని నిర్మాణానికి ఇచ్చేస్తున్నట్లు అధికారికంగా పత్రాలను అందజేశారు. దశాబ్ద కాలంగా రాజధానికి భూమి ఇవ్వకుండా మొండికేసిన రైతు, జగన్‌ను కలిసి పొన్నవోలు పేరు వినగానే ఇలా భూమిని అప్పగించేయడం విజయవాడ, గుంటూరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మిగిలిన కొంత మంది రైతులు కూడా అదే బాట పట్టే అవకాశం ఉంది.
