కూటమి కలసి ఉన్నంత కాలం జగన్ రెడ్డి గెలుపు దగ్గరకు కూడా రాలేడు.. నేను అయితే కూటమిని విడగొడతా…. అని విజయసాయిరెడ్డి ఇటీవల బహిరంగంగా చెప్పారు. అయితే కూటమిని విడగొట్టకపోయినా పర్వాలేదు.. ఓట్లను విడగొట్టడం ద్వారా జగన్ రెడ్డిని గెలిపించవచ్చని..తాను నిరూపిస్తానని సజ్జల రామకృష్ణారెడ్డి సలహా ఇచ్చారేమో కానీ.. వెంటనే అంబటి రాంబాబు ప్రయోగం జరిగిపోయింది. ఉద్దేశపూర్వకంగా ఆయన చంద్రబాబు అత్యంత ఘోరమైన తిట్లు తిట్టడం.. వెంటనే టీడీపీ కార్యకర్తల రియాక్షన్ రావడంతో వారనుకున్న ప్లాన్ ప్రారంభించారు. వెంటనే అంబటికి కాపు కుల మహా నేత అనే ట్యాగ్ తగిలించి.. వైసీపీలో ఉన్న కాపు నేతలందర్నీ .. చివరికి కుల పట్టింపు లేకుండా కమ్మ వ్యక్తినే పెళ్లి చేసుకున్న కుమార్తెను కూడా రంగంలోకి దింపి..కుల వ్యాఖ్యలు చేయించారు. ఇదంతా కాపుల్లో చీలిక తెచ్చి.. గత ఎన్నికల్లో వారు చూపించిన ఐక్యతను దూరం చేయడానికే.
అంబటి రాంబాబు ఇష్యూ పక్కా ప్లాన్
తాజాగా అంబటి రాంబాబు చుట్టూ జరుగుతున్న రాజకీయం యాదృచ్ఛికం కాదు, అది ఒక పక్కా ప్లాన్ . చంద్రబాబుపై అంబటి తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం, దానికి ప్రతిగా టీడీపీ శ్రేణులు స్పందించడం.. వెనువెంటనే దీనికి కుల రంగు పులమడం అంతా ఒక స్క్రిప్ట్ ప్రకారం సాగుతోంది. అంబటిని కాపు కుల మహానేతగా ప్రొజెక్ట్ చేస్తూ, వైసీపీలోని కాపు నేతలందరినీ రంగంలోకి దింపడం ద్వారా.. కాపుల్లో ఉన్న ఐక్యతను తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. కాపు సామాజికవర్గంలో భావోద్వేగాలను రెచ్చగొట్టడమే. పవన్ కల్యాణ్ నాయకత్వంలో ప్రస్తుతం ఐక్యంగా ఉన్న కాపులను విభజించి, వారిలో అభద్రతా భావాన్ని కలిగించడం ద్వారా కూటమి బలాన్ని తగ్గించాలనేదే జగన్ రెడ్డి అంతిమ లక్ష్యం.
కాపుల ఐక్యతను దెబ్బతీసి బలపడే వ్యూహం
ఇప్పుడు రాజకీయంగా కాపులు బలంగా ఉన్నారు. పవన్ కల్యాణ్ అందర్నీ ఏకతాటిపైకి తెచ్చారు. ఇక్కడే జగన్ రెడ్డికి మైనస్ అయింది. వారిని విడగొడితే తప్ప.. తనకు బతుకు లేదు. అందుకే కాపుల వేళ్లతోనేకాపుల కన్ను పొడిచేందుకు అంబటిని ప్రయోగించారు. ఆయనను బలి చేసి అయినా సరే కాపుల్ని విడగొట్టి .. పవన్ కల్యాణ్‌ను బలహీనం చేసి.. తాను బలపడాలనుకుంటున్నారు. వైసీపీలో ఉన్న కాపు నేతలంతా జగన్ రెడ్డి ప్లాన్ ను అర్థం చేసుకున్నారో లేదో కానీ.. రంగంలోకి దిగిపోతున్నారు. తమ కన్ను తాము పొడుచుకునేందుకు సిద్ధమవుతున్నారు. జగన్ రెడ్డి వేసే రాజకీయ పదవుల కోసం తమ వర్గానికి చరిత్రలో జరిగిన అన్యాయాన్ని మరోసారి చేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ వారికి సామాన్యుల నుంచి మద్దతు లభించడం లేదు.
ఇలాంటి కుల రాజకీయాలకు కాలం చెల్లింది !
జగన్ రెడ్డి అనుకుంటున్నట్లుగా ఇలాంటి విభజన రాజకీయాలకు ఇప్పుడు కాలం చెల్లిందనే వాదన బలంగా వినిపిస్తోంది. గతంతో పోలిస్తే కాపు సామాజికవర్గంలో రాజకీయ చైతన్యం పెరిగింది. ఐక్యత వల్ల దక్కే అధికారం, ప్రాధాన్యతను వారు కళ్లారా చూస్తున్నారు. కేవలం ఒక నేతను తిట్టడం వల్లనో లేదా కులం పేరుతో సెంటిమెంట్ రగిలించడం వల్లనో వారు విడిపోతారని అనుకోవడం భ్రమ కావచ్చు. వైసీపీ ప్లాన్ రివర్స్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు తోడు, ఇలా కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు ప్రజల్లో మరింత అసహనాన్ని కలిగిస్తున్నాయి. కాపుల వేళ్లతోనే వారి కన్ను పొడవాలని చూస్తున్న జగన్ వ్యూహం.. చివరకు ఆయన రాజకీయ భవిష్యత్తుకే ముప్పుగా మారే ప్రమాదం ఉంది.
