సీఎంను బూతులు తిట్టి జైలుకెళ్లిన అంబటి రాంబాబు బయటకు వచ్చాక చేస్తున్న రాజకీయం వైసీపీలోనే ఆయనకు మరెవరూ మద్దతివ్వకుండా చేస్తోంది. ఇతర రాజకీయాలు సంగతి పక్కన పెడితే తనను కాపు వర్గం టైగర్ అని చెప్పుకోవడం.. వాళ్లందరికీ తానే నాయకుడ్నని..వైసీపీలో ఆ వర్గం నుంచి తనను మించిన నేత లేడన్నట్లుగా వ్యవహరిస్తూండటంతో ఇతర నేతలు సీరియస్‌గా ఉన్నారు.
ముద్రగడ కంటే గొప్ప నేత అన్నట్లుగా ప్రచారం
వైసీపీ అధినేత ఆదేశాల మేరకు అంబటి రాంబాబును కాపు నేతలు వరుసగా వెళ్లి పరామర్శించారు. అయితే ఆయన ఈ పరామర్శలను ముఖ్యంగా జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఆయన చుట్టూ ఒక రకమైన హీరోయిజం బిల్డప్ ఇవ్వడం, సోషల్ మీడియాలో ఆయనే పార్టీకి పెద్ద దిక్కు అన్నట్లుగా ప్రచారం చేయించుకోవడం పార్టీలోని ఇతర కాపు నేతల్లో అసహనానికి కారణమవుతోంది. కాపు సామాజికవర్గం కోసం దశాబ్దాలుగా పోరాడి, ఉద్యమనేతగా గుర్తింపు పొందిన ముద్రగడ పద్మనాభం వంటి వారే ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. అయితే, అంబటి అనుచర వర్గం చేస్తున్న ప్రచారంలో ముద్రగడ కంటే అంబటే పెద్ద కాపు టైగర్ అన్నట్లుగా చిత్రీకరించడం సదరు సామాజికవర్గ నేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది. ముద్రగడ వంటి ఉద్ధండులనే కాదని, అంబటిని మునగచెట్టు ఎక్కించే ప్రయత్నం చేయడం వల్ల పార్టీలో అంతర్గత విబేధాలు పెరుగుతున్నాయి.
పెయిడ్ ఇంటర్వ్యూలు – ఇమేజ్ మేనేజ్మెంట్
అంబటి రాంబాబు తన ఇమేజ్ను పెంచుకోవడానికి భారీగా ఖర్చు చేస్తున్నారనే గుసగుసలు తాడేపల్లి వర్గాల్లో వినిపిస్తున్నాయి. డబ్బులిచ్చి మరీ సోషల్ మీడియా ఇంటర్వ్యూలు చేయించుకోవడం, తనను తాను ఒక మాస్ లీడర్‌గా ప్రొజెక్ట్ చేసుకోవడం వంటివి ఆయనకు మేలు చేస్తాయో లేదో కానీ, పార్టీలో మాత్రం నెగెటివ్ మార్కులు పడేలా చేస్తున్నాయి. రాజకీయాల్లో అతి ఎప్పుడూ ప్రమాదకరమేనని, అంబటి చేస్తున్న ఈ అతి చివరికి ఆయనకే రివర్స్ అవుతుందని పార్టీలోని ఇతర నేతలు సెటైర్లు వేస్తున్నారు.
చివరికి బూమరాంగ్ అయ్యే ప్రమాదం
వైసీపీలో జగన్ తర్వాత అంతా సమానమే అన్నట్లుగా ఉండాలి తప్ప, ఒక నేత తనను తాను అతిగా ప్రొజెక్ట్ చేసుకోవడం అధినేతకు కూడా నచ్చకపోవచ్చు. ఇప్పటికే సజ్జల వంటి వారి ప్రాధాన్యత తగ్గుతున్న తరుణంలో, అంబటి ఈ రకమైన ప్రచారంతో అందరి కళ్లలో పడ్డారు. నిజానికి కాపు టైగర్ అని జగనే అన్నారు..కానీ తన మాటలతో పార్టీలో ఓ వర్గానికి తానే దిక్కు అన్నట్లుగా మారే ప్రయత్నం చేయడం పార్టీ హైకమాండ్ దృష్టిలో ఆయన పట్ల ప్రతికూలతను పెంచి, రాజకీయంగా ఒంటరిని చేసే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. త్వరలోనే సైడ్ ఎఫెక్టులు బయటపడే అవకాశాలు ఉన్నాయి.
