ఈరోజు తెలంగాణా విమోచన దినోత్సవ సందర్భంగా వరంగల్ జిల్లాలో హన్మకొండ వద్ద భాజపా బహిరంగ సభ నిర్వహించింది. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తప్ప ఆ సభలో మాట్లాడిన తెలంగాణా రాష్ట్ర భాజపా నేతలు అందరూ కొత్తగా ఏమీ మాట్లాడలేకపోయారు.
ముస్లిం మైనార్టీ ఓట్లు పోతాయనే భయంతోనే తెరాస ప్రభుత్వం తెలంగాణా విమోచన దినోత్సవం జరపడానికి భయపడుతోందని అన్నారు. అంతకు ముందు సమైక్య రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, తెదేపాలు కూడా ఆ కారణంతోనే తెలంగాణా విమోచన దినోత్సవం జరుపకుండా తప్పించుకోనేవని సభలో మాట్లాడిన డా.లక్ష్మణ్, కిషన్ రెడ్డి, మురళీధర్ రావు, బండారు దత్తాత్రేయ తదితరులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. జాతీయ దృక్పధంతో దేశహితం కోసం పనిచేసే భాజపాకి రాష్ట్రంలో అధికారం ఇస్తే తెలంగాణా విమోచన దినోత్సవం తప్పకుండా నిర్వహిస్తామని అన్నారు.
భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాత్రం తెరాస సర్కార్ పై ఏమాత్రం మొహమాటం పడకుండా విరుచుకు పడ్డారు. తెలంగాణాకి పొరుగునే ఉన్న మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నప్పుడు తెలంగాణా సర్కార్ ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణా గడ్డపై రుద్రమదేవి వంటి ఏందరో పరాక్రమవంతులు పుట్టారని, అటువంటి గడ్డపైనే అనేకమంది అమరవీరులు కూడా రజాకార్లకి వ్యతిరేకంగా ప్రాణాలొడ్డి పోరాడారని వారందరికీ నమస్కరిస్తున్నానని అన్నారు. వారి త్యాగాలకి గుర్తింపుగా వారిని గౌరవిస్తూ తెరాస సర్కార్ తెలంగాణా విమోచన దినోత్సవం జరపుతుందని తాను ఆశించానని కానీ నిర్వహించకపోవడంతో తాను చాలా నిరాశ చెందానని అన్నారు.
కెసిఆర్ తనని ఎన్నుకొన్న రాష్ట్ర ప్రజల అభిమతానికి అనుగుణంగా నడుచుకోవాలి తప్ప మజ్లీస్ పార్టీ కనుసైగలని బట్టి కాదని అమిత్ షా అన్నారు. ఎన్నికల సమయంలో రైతులకి పంట రుణాలు మాఫీ చేస్తానని కెసిఆర్ హామీ ఇచ్చారని దానిని ఎందుకు నిలుపుకోలేకపోయారని అమిత్ షా సూటిగా ప్రశ్నించారు. కెసిఆర్ తాను ఇచ్చిన హామీలని నిలబెట్టుకోలేకపోయినా కనీసం కేంద్రప్రభుత్వం అందిస్తున్న పంట భీమా పధకం అయినా తెలంగాణాలో రైతులకి ఎందుకు చేరడం లేదని ప్రశ్నించారు.
అమిత్ షా చాలా చక్కగానే తెరాస సర్కార్ ని నిలదీశారు. కానీ ఆయన తెరాసకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే, ప్రధాని నరేంద్ర మోడీతో సహా కేంద్రమంత్రులు తెరాస సర్కార్ కి చాలా అనుకూలంగా మాట్లాడుతుంటారు. ఈ ద్వంద వైఖరి వలన రాష్ట్ర భాజపా నేతలు తెరాసతో ఏవిధంగా వ్యవహరించాలో తెలియని అయోమాయ స్థితిలో ఉంటున్నారు. కనుక ముందుగా తెరాస పట్ల తమ పార్టీ వైఖరి ఏమిటి? అనే దానిపై వారు స్పష్టత ఏర్పరచుకోగలిగితే, తెలంగాణాలో భాజపా పరిస్థితి, దాని భవిష్యత్ ఏవిధంగా ఉంటుందో కొంత స్పష్టత వస్తుంది. లేకుంటే ఈ ద్వంద వైఖరి వలన ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుంది. దాని వలన చివరికి భాజపాయే నష్టపోతుంది.