రవి : వ్యవస్థలన్నీ అస్తవ్యస్థం..! తెలంగాణలో ప్రభుత్వం లేనట్లే..!

(This article is part of Telugu360 Contributor Network and hasn't been edited by our team. If you have any questions or want to contribute, reach out to krishna@telugu360.com)

తెలంగాణలో వరుసగా చోటు చేసుకుంటున్న సంఘటనలు చూస్తే.. అసలు ప్రభుత్వం ఉందా లేదా అన్న అనుమానం. .ఎవరికైనా వస్తుంది. ఎందుకంటే.. ప్రభుత్వమే ఉద్యోగులను అవినీతి పరులుగా చిత్రీకరిస్తోంది. వ్యవస్థలు మొత్తం పనికి రాన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఏ పనీ ముందుకు జరగడం లేదు. మంత్రులు కూడా.. ఒక్కటంటే.. ఒక్క నిర్ణయమూ తీసుకోలేని స్థితిలో ఉన్నారు. ఇవన్నీ తెలంగాణలో అసలు ప్రభుత్వమే లేదన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి.

మంత్రులకు తమ శాఖలేవో కూడా తెలియడం లేదా..?

తెలంగాణలో ఏ శాఖలోనూ చూసినా ఎక్కడిక్కడ పేరుకుపోయిన ఫైళ్లు కనిపిస్తున్నాయి. అధికారులు ఎవరూ.. పని చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ప్రజలు పోరు పెడుతున్నా.. పట్టించుకునేవారు లేరు. మంత్రులకు… అసలు అధికారాలు లేవు. తమకు కేటాయించిన శాఖలపై మంత్రులకు అవగాహన లేకపోవడం తో పనులుకుంటుపడుతున్నాయి.ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఏ ఒక్క మంత్రి ఆయా శాఖలపై పూర్తిగా సమీక్షించిన పాపాన పోలేదు. తెలంగాణాలో మంత్రులు స్వంతంగా నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. తమ శాఖకు సంబంధించిన చిన్న చిన్న విషయాలపై కూడా పెద్దగా స్పందించలేని స్థితిలో ఉన్నారు. దీనితో వ్యవహారం రచ్చ రచ్చ అవుతుంది. ఇంటర్ బోర్డ్ ఫలితాలే సాక్ష్యం. మంత్రి జగదీష్ రెడ్డి… తాను విద్యాశాఖకు మంత్రిననే సంగతిని రెండు రోజుల కిందట వరకు మర్చిపోయారు.

సమస్యలొస్తే చినజీయర్ లాంటి స్వాములకే చెప్పుకోవాలా..?

రెవెన్యూ శాఖ ను ప్రక్షాళన చేస్తామంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేయడం తో ఒక్కసారిగా ఆ శాఖలో ఉన్న ఉద్యోగులు ఆందోళనలకు గురయ్యారు. కనీసం తమ డిమాండ్లను చెప్పుకోనే పరిస్థితి లేకపోవడంతో రెవెన్యూ శాఖ కు మంత్రి లేకపోవడం సీఎం వారికి కలిసే సమయం ఇవ్వకపోవడంతో వారు నేరుగా వెళ్లి చిన జీయర్ స్వామిని కలిశారు. ఇది తెలంగాణలో పరిస్థితిని అద్దంపట్టింది. గత ఏడు నెలల కాలంలో మంత్రులు ఏ ఒక్క అధికారిక నిర్ణయంతీసుకోలేదు. సమీక్షలు , సమావేశాలు నిర్ణయించాలన్నా క్యాంప్ ఆఫీసు నుంచి సందేశం రావాల్సిందే. అలాంటిదేమీ రావడం లేదు. తెలియకుండా.. సమీక్ష నిర్వహిస్తే తర్వాత పదవి ఉంటుందో ఉండదోన్న భయం వెంటాడుతూ ఉంది.

ప్రభుత్వాధినేత ఎలానో అధికారులూ అంతే..!

కొద్ది రోజుల క్రితం నిలోఫర్ ఆసుపత్రిలో చిన్న పిల్లలు అస్వస్థతకు గురైతే కనీసం వైద్య శాఖ మంత్రి పట్టిపట్టనట్టు వ్యవహరించారు. కుదిపేసిన ఇంటర్ బోర్డ్ వ్యవహారం లో స్వయంగా సీఎం సమీక్ష నిర్వహించినా…. కనీసం విద్యా శాఖ మంత్రి ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించలేదు. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా వడ గళ్ళ వాన తో అకాల నష్టం జరిగితే మంత్రులు అసలు విషయమే కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. వారిని పని చేయమని… కూడా ఎవరూ అడగడం లేదు. ప్రతీ విషయాన్ని ప్రగతి భవన్‌కు అధికారులు రిపోర్ట్ చేస్తున్నారు. దాంతో… ఆయా శాఖల కు సంబంధించిన సెక్రటరీ లు కూడా మంత్రుల్ని లెక్కలోకి తీసుకోవడం లేదు. పాలన పూర్తిగా కుంటుపడిపోయింది. ప్రజలు బాధలు ప్రజలు పడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com