ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం, మైనింగ్ స్కామ్‌లతో పాటు ఇతర అవినీతి కేసులలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హఠాత్తుగా వేగం పెంచడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. నిన్నమొన్నటి వరకు విచారణలు మందకొడిగా సాగుతున్నాయన్న తరుణంలో.. ఒక్కసారిగా ఈడీ అధికారులు ఏపీ, తెలంగాణ అంతటా దాడులు, సమన్లు, అటాచ్మెంట్లతో విరుచుకుపడుతున్నారు. మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారి, మాజీ ఎండీ డొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య లక్ష్మి, కుమారుడు మోహిత్ రెడ్డిలను కూడా హైదరాబాద్ ఆఫీసులో గంటల తరబడి విచారించి, రూ.64 కోట్ల ఆస్తుల గుట్టు లాగారు. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సైతం ఈడీ వరుసగా మూడోసారి పిలిపించి బోనులో నిలబెట్టడం వెనుక.. తాడేపల్లి ప్యాలెస్ వేసుకున్న ఒక రాజకీయ సెల్ఫ్ గోల్ వ్యూహమే ప్రధాన కారణమనే చర్చ జోరుగా సాగుతోంది.
ప్రొఫెసర్ నాగేశ్వర్ లీకులతో పెరిగిన పొలిటికల్ ప్రెజర్!
అసలు లీగల్ కేసుల్లో హఠాత్తుగా ఈడీ ఇంతలా యాక్టివ్ అవ్వడం వెనుక వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆడిన మైండ్ గేమ్ రివర్స్ కొట్టిందనే విశ్లేషణలు వస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ పెద్దలకు, ముఖ్యంగా ప్రధాని మోదీ, అమిత్ షాలకు తాను చాలా దగ్గర అని, తనను ఎవరూ ఏమీ చేయలేరని ఏపీ ప్రజలకు, కూటమి శ్రేణులకు చూపించుకోవాలని జగన్ ఆశపడ్డారు. ఇందుకోసం రాజకీయ విశ్లేషకుడి ముసుగులో ఉన్న నాగేశ్వర్‌ను వాడుకుని.. జగన్ రెడ్డి బీజేపీకి పర్మినెంట్ ఫ్రెండ్.. ఆ విషయం పవన్ కళ్యాణ్‌కు స్వయంగా అమిత్ షా చెప్పారు అంటూ ఒక ఫేక్ పిట్టకథను లీక్ చేయించారు. ఈ లీక్ ద్వారా కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టడంతో పాటు, లీగల్ కేసుల నుంచి తనను కాపాడుతోంది బీజేపీనే అనే సందేహాన్ని జనం మైండ్ లోకి నెట్టాలనేది తాడేపల్లి కోటరీ ప్లాన్.
రివర్స్ కొట్టిన స్కెచ్.. ఢిల్లీ పెద్దలపై పెరిగిన ఒత్తిడి!
అయితే, ఈ ఫేక్ ఫ్రెండ్షిప్ ప్రచారం కాస్తా ఢిల్లీలోని బీజేపీ అగ్రనాయకత్వం వద్దకు వెళ్లేసరికి సీన్ పూర్తిగా రివర్స్ అయినట్లుగా సీన్ కనిపిస్తోంది. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అత్యంత పటిష్టంగా ఉంటూ, అవినీతిపై యుద్ధం ప్రకటిస్తే.. తెరవెనుక తాము జగన్ రెడ్డిని కాపాడుతున్నామనే అపవాదు తమపై పడటాన్ని బీజేపీ సహించే అవకాశం లేదు. ఈ దుష్ప్రచారంతో కూటమి ఓటర్లలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని గ్రహించిన ఢిల్లీ పెద్దలు.. తమపై పడిన ఫ్రెండ్షిప్ ముద్రను చెరిపేసుకోవడానికి, జగన్ రెడ్డిపై ఎలాంటి సాఫ్ట్ కార్నర్ లేదని చేతలోనే చెప్పాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
మద్యం, గనుల స్కామ్.. అందరి గుట్టు రట్టు!
ఈడీ అధికారులు అటు మద్యం కుంభకోణం, ఇటు గనుల స్కామ్‌లకు సంబంధించిన లూప్‌హోల్స్ అన్నింటినీ క్లియర్ కట్‌గా తెరపైకి తెచ్చారు. వాసుదేవరెడ్డి బంధువుల పేరిట షెల్ కంపెనీల ద్వారా జరిగిన రూ. 1,048 కోట్ల కిక్బ్యాక్స్ లీలలను బయటపెట్టారు. చెవిరెడ్డి కుటుంబానికి చెందిన తుడా అధికారిక వాహనాలను అక్రమంగా డబ్బులు తరలించడానికి ఎలా వాడారో లాగ్బుక్స్తో సహా పట్టుకున్నారు. జగన్ రెడ్డి పీఏ కేఎన్ఆర్ అక్రమాస్తులను వెలికి తీశారు. ఇక విజయసాయిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తూ.. బినామీ నిధుల లెక్కలను కూడా ఈడీ టేబుల్ పైకి తెచ్చింది. జగన్ రెడ్డి సిఎంఓ మాజీ అధికారులు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల విచారణతో ఈ మొత్తం స్కామ్ సూత్రధారుల లింకులన్నీ తాడేపల్లి వైపే చూపిస్తున్నాయి.
గట్టిగా దొరికిపోయినట్లే
రాజకీయంగా మైలేజ్ కోసం, కూటమిని డిఫెన్స్‌లో పడేయడం కోసం ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వారిని ముందు పెట్టి తాడేపల్లి ప్యాలెస్ ఆడిన ఫ్రెండ్ షిప్ డ్రామా .. చివరికి సొంత పార్టీ నేతల పాలిట మరణశాసనంగా మారింది. బీజేపీని ఇరుకున పెట్టాలని చూసి.. తామే దర్యాప్తు సంస్థల ముందు అడ్డంగా దొరికిపోయేలా చేసుకున్నారు. ఈడీ వేగం చూస్తుంటే.. రాబోయే రోజుల్లో ఏపీ మద్యం, గనుల స్కామ్‌లలో వైఎస్సార్సీపీకి చెందిన మరికొందరు కీలక పెద్దలు జైలు గోడల మధ్యకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
