అనంత శ్రీరామ్ పేరు ఈమధ్య వివాదాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. మొన్నామధ్య ‘కల్కి’ సినిమాపై కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. సినిమాల కోసం పురాణాల్ని, పురాణ పాత్రల్ని ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారని మండి పడ్డారు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ అనంత శ్రీరామ్ పై ఫైర్ అయ్యారు. ఇప్పుడు ‘సరస్వతీ పుత్ర’పై కొత్త కాంట్రవర్సీ లేవనెత్తారు.
తెలుగు360కి ఇచ్చిన ఇంటర్వ్యూలో `సరస్వతి పుత్ర` అని సంబోధించినప్పుడు ‘నేను సరస్వతీ పుత్రుడ్ని కాదు.. పావనీ పుత్రుడ్ని’ అని ఉటంకించారు. సరస్వతీ పుత్ర అని పిలిపించుకోవడం అంత సులభం కాదని, సరస్వతిని మించిన ప్రతిభాపాటవాలు ఉండాలని, శ్రీశ్రీ లాంటి ఒకరో ఇద్దరో ఇలాంటి పిలుపుకి అర్హులని పేర్కొన్నారు. దాంతో సరస్వతీ పుత్ర అనే బిరుదు పై చర్చ మొదలైంది.
టాలీవుడ్ లో రామజోగయ్య శాస్త్రిని ‘సరస్వతీ పుత్ర’ అని పిలుచుకొంటుంటారు. సినిమాల్లో టైటిల్ కార్డ్ వేసినప్పుడు కూడా సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి అనే పేరు కనిపిస్తుంది. ఇప్పుడు అనంత శ్రీరామ్ కూడా ఆయన్నే టార్గెట్ చేస్తూ, ఇలా వ్యాఖ్యానించారన్న కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. రామజోగయ్య తల్లి పేరు సరస్వతమ్మ. అందుకే ఆయన సరస్వతీ పుత్ర అని టైటిల్ కార్డు వేసుకొంటారు. ఈ విషయంలో అనంత శ్రీరామ్ అభ్యంతరాలు ఏమిటో అర్థం కావడం లేదు. భాషపై పట్టు, మమకారం, సాధికారికత ఉన్నవాళ్లని సరస్వతి పుత్రుడు అని పిలుచుకొంటారు. ఆ లెక్కన చూసినా రామజోగయ్య అర్హుడే అనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి.


