తెలంగాణ , ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన టైర్-2 నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వరంగల్, కరీంనగర్, తిరుపతి వంటి నగరాల్లో ఓపెన్ ప్లాట్ల వ్యాపారం గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 15 శాతం వృద్ధిని నమోదు చేసింది. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ధరలు సామాన్యులకు అందుబాటులో లేకపోవడం, ఐటీ , పారిశ్రామిక రంగాలు ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తుండటంతో పెట్టుబడిదారులు ఇప్పుడు ఈ ప్రాంతాల వైపు మొగ్గు చూపుతున్నారు.
ముఖ్యంగా మధ్యతరగతి వర్గాల వారు భవిష్యత్తు అవసరాల కోసం ఈ నగరాల శివార్లలో ప్లాట్లు కొనడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా ఎదుగుతున్న వరంగల్లో రియల్ ఎస్టేట్ బూమ్ కనిపిస్తోంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ,వరంగల్ ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ వార్తలు ఇక్కడి భూముల ధరలకు రెక్కలు తెచ్చాయి. కరీంనగర్లో ఐటీ టవర్లు, పర్యాటక రంగ అభివృద్ధి వల్ల పట్టణ సరిహద్దులు వేగంగా విస్తరిస్తున్నాయి. గతంలో కేవలం వ్యవసాయ భూములుగా ఉన్న ప్రాంతాలు నేడు డీటీసీపీ అనుమతి పొందిన లేఅవుట్లుగా మారుతున్నాయి. ఇక్కడ గత ఏడాదితో పోలిస్తే ప్లాట్ల అమ్మకాల్లో సుమారు 14 నుంచి 16 శాతం వరకు ధరల పెరుగుదల కనిపించడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో కూడా ఇదే విధమైన ట్రెండ్ కొనసాగుతోంది. ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం కావడంతో పాటు, అక్కడ ఏర్పాటవుతున్న కొత్త టౌన్షిప్లు ,పారిశ్రామిక కారిడార్లు రియల్ ఎస్టేట్ వృద్ధికి ప్రధాన కారణమయ్యాయి. తిరుపతి-మదనపల్లి , తిరుపతి-చెన్నై హైవేల వెంట వెలుస్తున్న ఓపెన్ ప్లాట్ వెంచర్లకు డిమాండ్ భారీగా పెరిగింది.
ఈ నగరాల్లో 15 శాతం వృద్ధి నమోదు కావడానికి మెరుగైన కనెక్టివిటీ ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. కొత్తగా నిర్మిస్తున్న బైపాస్ రోడ్లు, అండర్ పాస్లు ,మెరుగైన డ్రైనేజీ వ్యవస్థలు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచాయి. అపార్ట్మెంట్ల కంటే ఓపెన్ ప్లాట్లపై పెట్టుబడి పెడితే తక్కువ కాలంలోనే ఎక్కువ లాభం వస్తుందని భావించడం కూడా ఈ రంగం పుంజుకోవడానికి కారణం.

