ప్రజాస్వామ్యానికి రెండు కళ్లు.. ఒకటి అధికార పక్షం, రెండు బలమైన ప్రతిపక్షం. ఒకరు పాలన సాగిస్తే, మరొకరు ఆ పాలనలోని లోపాలను ఎత్తిచూపుతూ ప్రజల పక్షాన నిలబడాలి. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఈ సమతుల్యత పూర్తిగా దెబ్బతిన్నది. 2024 ఎన్నికల్లో 39 శాతం ఓట్లు సాధించినప్పటికీ, వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పాత్రను పోషించడంలో పూర్తిగా విఫలమయింది. అసెంబ్లీకే వెళ్లడం లేదు. కేవలం సోషల్ మీడియా పోస్టులకు, ప్రెస్ మీట్లకు పరిమితమవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో ఒక శూన్యతను సృష్టించింది. ప్రజల కోసం గొంతు ఎత్తే నిఖార్సైన ప్రతిపక్షం కోసం ఏపీ ఎదురుచూస్తోంది.
ప్రజా సమస్యలు పట్టని షెడ్డు రాజకీయం!
రాష్ట్రంలో సమస్యలు చాలా ఉన్నాయి. సమస్యలు లేని రాష్ట్రం ఉండదు. ఒకటి పరిష్కరిస్తే మరో సమస్య వస్తుంది. ప్రభుత్వానికైనా అన్ని సమస్యలు పరిష్కరించడం అసాధ్యం. ఆ సమస్యలను గుర్తించి సమస్యలపై పోరాడాల్సిన ప్రధాన ప్రతిపక్షం.. ఆ బాధ్యతను గాలికొదిలేసినట్లు కనిపిస్తోంది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న నెపంతో సభా బహిష్కరణ చేయడం వల్ల, తమకు ఓటు వేసిన39 శాతం మంది ప్రజల ఆకాంక్షలను చట్టసభలో వినిపించే అవకాశాన్ని వైసీపీ స్వయంగా కాలరాసుకుంది. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీయడం కంటే, తాడేపల్లి ప్యాలెస్ నుండి విమర్శలు చేయడమే రాజకీయం అని భావించడం వల్ల ఆ పార్టీ ప్రతిష్ట రోజురోజుకూ దిగజారుతోంది.
చిచ్చు పెట్టే వ్యూహం.. చైతన్యం లేని విమర్శలు!
ప్రస్తుత ప్రతిపక్షం చేస్తున్న రాజకీయం అంతా చిచ్చు పెట్టడం చుట్టూనే తిరుగుతోంది. అధికార కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య విభేదాలు సృష్టించడం లేదా ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం ద్వారా లబ్ధి పొందాలని చూడటం ఒక దిగజారుడుతనానికి నిదర్శనం. ప్రజలకు కావాల్సింది కూటమి పార్టీల మధ్య గొడవలు కాదు; తమ బతుకులు బాగుపడేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే నాయకత్వం. బాధ్యతాయుతమైన విమర్శలు మాని, కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితమవ్వడం వల్ల విపక్షం తన విశ్వసనీయతను కోల్పోతోంది.
ప్రతిపక్షం లేని లోటు.. ఎవరికి నష్టం?
ప్రతిపక్షం బలంగా లేకపోవడం వల్ల అంతిమంగా నష్టపోయేది ప్రజలే. ప్రభుత్వం చేసే చిన్న చిన్న పొరపాట్లను అడగేవారు లేకపోతే, పాలనలో నిరంకుశత్వం పెరిగే ప్రమాదం ఉంది. కూటమి ప్రభుత్వంపై నిర్మాణాత్మక విమర్శలు చేస్తూ, ఎప్పటికప్పుడు వారిని అప్రమత్తం చేసే గొంతుక ఇప్పుడు రాష్ట్రానికి అత్యవసరం. రాజకీయం అంటే కేవలం ఎన్నికల్లో గెలవడం మాత్రమే కాదు, ఓడినప్పుడు ప్రజల గొంతుకగా నిలబడటం కూడా అని నేటి ప్రతిపక్షం విస్మరిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పుడు ఒక నాయకుడో, ఒక పార్టీనో కాదు.. ప్రజల కష్టాలను తన కష్టంగా భావించి, రోడ్ల మీదకు వచ్చి పోరాడే ఒక ‘నిఖార్సైన ప్రతిపక్షం’ కావాలి. కేవలం ఐదేళ్ల తర్వాత వచ్చే అధికారం కోసం కాకుండా, ప్రతిరోజూ సామాన్యుడి పక్షాన నిలబడే గొంతుక వినిపించాలి. అందుకే ఇప్పుడు రాష్ట్రంలోని మేధావులు, సామాన్య జనం మనసారా కోరుకుంటున్నది ఒక్కటే.. దేవుడా.. ఏపీకి ప్రజా సమస్యలపై పోరాడే ఒక అసలైన ప్రతిపక్షాన్ని ప్రసాదించు అని.
