సంక్రాంతి సీజన్ అనిల్ రావిపూడికి బాగా కలిసొచ్చింది. గత సంక్రాంతికి బాక్సాఫీసుని ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో కొల్లగొట్టారు. దాదాపు రూ.300 కోట్లు వసూలు చేసిన చిత్రమిది. వెంకటేష్ కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ హిట్. ఈ సంక్రాంతికి కూడా అనిల్ రావిపూడి ‘మన శంకర ప్రసాద్ గారు` తో మరో సూపర్ హిట్టు కొట్టారు. ఇదే సెంటిమెంట్ తో వచ్చే సంక్రాంతికి సైతం అనిల్ రావిపూడి ఓ సినిమాని దించబోతున్నారు. వెంకటేష్ తో గానీ, బాలకృష్ణతోగానీ అనిల్ రావిపూడి మరో సినిమా చేయబోతున్నారని ప్రచారం జరిగింది. వెంకీతో చేస్తే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్ చేస్తారని అనుకొన్నారు. ఈ సీక్వెల్ కి సంబంధించిన లైన్ కూడా అనిల్ రావిపూడి దగ్గర సిద్ధంగానే ఉంది.
అంతా అనుకొన్నట్టే వెంకీతోనే రావిపూడి సినిమా దాదాపు ఫిక్సయ్యింది. కాకపోతే `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రానికి సీక్వెల్ మాత్రం కాదు. అనిల్ రావిపూడి పూర్తిగా కొత్త కథ రాసుకొన్నారు. “సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ చేయొచ్చు.కానీ నాకు కొత్త కథ చెప్పాలని వుంది. కొత్త వరల్డ్ సృష్టించాలని వుంది. అందుకే ఈసారి కొత్త కథ రాసుకొంటున్నా“ అని తెలుగు 360కి ఇచ్చిన ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో చెప్పారు అనిల్ రావిపూడి. వెంకటేష్‌కి కూడా చూచాయిగా లైన్ వినిపింనట్టు సమాచారం. ఆయన నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ అందింది. మే నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. ఈలోగా వెంకీ – త్రివిక్రమ్ సినిమా కూడా పూర్తవుతుంది. 2027 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ఫిబ్రవరిలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుంది.
