రాజకీయాల్లో పాజిటివ్ ప్రచారం కంటే నెగెటివ్ ప్రచారానికే ఇంపాక్ట్ ఎక్కువ. తెలంగాణ జనసేనకు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుథ్ ఇలాంటి ప్రచారం కల్పిస్తున్నారు. ఆయితే ఆయన కూడా ఆలస్యంగా రంగంలోకి వచ్చారు. అలాగే ఆయనొక్కరు కూడా సరిపోవడం లేదు. మరో నలుగురు అలాంటి నేతలు ఉంటే.. జనసేన పార్టీకి పబ్లిసిటీకి కొదవ ఉండదు.
జనసేనను చివరిక్షణంలో వెలుగులోకి తెచ్చిన అనిరుథ్ రెడ్డి
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన పార్టీ అడుగుపెట్టడం తొలుత ఎవరినీ పెద్దగా ఆకర్షించలేదు. కేవలం తమ ఉనికిని చాటుకోవడానికి, పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపడానికి మాత్రమే ఆ పార్టీ పోటీ చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, ప్రచారం ముగిసే సమయానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా జనసేన వైపు అందరి దృష్టి మళ్లేలా చేశాయి. తెలంగాణలో జనసేన పోటీ చేయడంపై ఆయన చేసిన విమర్శలు ఆ పార్టీ అభ్యర్థులకు అనూహ్యమైన పబ్లిసిటీని తెచ్చిపెట్టాయి. రాజకీయాల్లో ఎప్పుడూ వెలుగులో ఉంటేనే ఓటర్ల దృష్టిలో పడతారన్న సూత్రాన్ని అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు మరోసారి నిరూపించాయి.
ఆలస్యంగా స్పందించిన అనిరుథ్ రెడ్డి
రాజకీయాల్లో ప్రత్యర్థుల విమర్శలే ఒక్కోసారి వరంగా మారుతుంటాయి. జనసేన అభ్యర్థుల గురించి ఎవరూ చర్చించుకోని సమయంలో, అనిరుధ్ రెడ్డి వారిని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలతో ఆ పార్టీ అభ్యర్థులు రేసులో ఉన్నారన్న విషయం సామాన్య ప్రజల వరకు వెళ్లింది. అయితే, ఈ హడావుడి అంతా పోలింగ్ తేదీకి కేవలం రెండు మూడు రోజుల ముందే జరగడం జనసేనకు పెద్ద మైనస్‌గా మారింది. ఈ ప్రచారం కనీసం వారం పది రోజుల ముందుగానే జరిగి ఉంటే మరింత మంది స్పందించేవారు. ఈ వివాదం.. పార్టీకి క్షేత్రస్థాయిలో మరింత బలమైన మైలేజీ వచ్చేదియ
జనసేనకు కౌంటర్ ఇచ్చే గొంతుకలు ఎక్కడ?
అనిరుధ్ రెడ్డి వంటి నేతలు విమర్శలు చేసినప్పుడు, అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చే నాయకత్వం తెలంగాణ జనసేనలో కనిపించకపోవడం ఆ పార్టీ బలహీనతను చాటిచెప్పింది. అనిరుధ్ రెడ్డితో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు ముందుగానే రచ్చ చేసి ఉంటే.. దాన్ని అనుకూలంగా మార్చుకుని మైలేజీ సాధించే అవకాశం ఉండేది. కానీ, అటు ప్రతిపక్షాల నుంచి సరైన సమయంలో విమర్శలు రాకపోవడం, ఇటు జనసేన వైపు నుంచి సమర్థవంతమైన కౌంటర్లు లేకపోవడంతో ఒక మంచి అవకాశాన్ని ఆ పార్టీ కోల్పోయిందని చెప్పవచ్చు.
పోలింగ్ తేదీ వచ్చేయడంతో ఇప్పుడు జనసేనకు లభించిన ఈ చివరి నిమిషం ప్రచారం ఓట్ల రూపంలో మారకపోవచ్చు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ద్వారా తన ఉనికిని చాటాలనుకున్న జనసేనకు, కాంగ్రెస్ నేతల విమర్శలు పరోక్షంగా సహాయపడ్డాయనడంలో సందేహం లేదు. భవిష్యత్ ఎన్నికల్లో ఇలాంటి అవకాశాలను జనసేన అందిపుచ్చుకోవాల్సి ఉంది.
