ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్లలో అంతా సీక్రెట్ స్పైలవే హాట్ స్టోరీలు. శత్రు క్యాంపుల్లో చేరి వారి సమాచారం తెలుసుకుని.. చివరికి వారిని నాశనం చేసి బయటకు వస్తూంటారు. రాజకీయాల్లోనూ ఇలాంటివి ఉంటాయి. కానీ బయటకు తెలియవు. ఇప్పుడు విజయసాయిరెడ్డి బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారంతో ఇదే తరహా స్టోరీ కావొచ్చన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
వైసీపీ ఏజెంట్గా బీజేపీలోకి?
జగన్ లేకుండా విజయసాయిరెడ్డి లేరు, విజయసాయిరెడ్డి లేకుండా జగన్ లేరు అన్నంతటి బలమైన బంధం వీరిది. అటువంటిది వీరి మధ్య దూరం పెరిగింది. విజయసాయిరెడ్డి పార్టీకి దూరం అయ్యారు. ఏడాది తర్వాత ఇప్పుడు బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. విజయసాయిరెడ్డి ఢిల్లీ కేంద్రంగా రాజకీయం చేయడంలో దిట్ట. వైసీపీ తరపున ఢిల్లీ రాజకీయాలు చక్కబెట్టినప్పుడు ఆయన బీజేపీ పెద్దలతో దగ్గర సంబందాలు పెట్టుకున్నారు. అవే సంబంధాలతో ఆ పార్టీలో చేరబోతున్నారని చెబుతున్నారు. అయితే ఆయన బీజేపీలో చేరేది వైసీపీ, జగన్ ప్రయోజనాల కోసమేనన్న చర్చలు జరుగుతున్నాయి.
కూటమిలో చిచ్చు పెట్టే ట్రోజన్ హార్స్ వ్యూహం
కూటమిలో ప్రస్తుతం బీజేపీ-టీడీపీ-జనసేన కలిసి ఉన్నాయి. ఈ ఐక్యతను దెబ్బకొట్టాలన్నా, కేంద్రం వద్ద చంద్రబాబుకున్న ప్రాబల్యాన్ని తగ్గించాలన్నా బీజేపీ లోపల ఒక బలమైన గొంతు వైసీపీకి అవసరం. ఆ లోటును భర్తీ చేయడమే సాయిరెడ్డి అసలు లక్ష్యమని గుసగుసలు వినిపిస్తున్నాయి.విజయసాయిరెడ్డి బీజేపీలో చేరితే, అది రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో అనిశ్చితికి దారితీసే అవకాశం ఉంది. బీజేపీని టీడీపీకి దూరం చేసేలా పావులు కదపడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అండర్కవర్ స్పై తరహాలో బీజేపీలోని కీలక నేతలను ప్రభావితం చేస్తూ, వైసీపీకి పరోక్షంగా లాభం చేకూర్చే లోపలి మనిషి గా ఆయన వ్యవహరించవచ్చని భావిస్తున్నారు. అందుకే ఈ విభేదాల డ్రామా అంతా బీజేపీలోకి ప్రవేశించడానికి వేసిన రెడ్ కార్పెట్ స్కెచ్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది.
గతంలో జనసేన, టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు
అసలు ఆయన బీజేపీలోకి ఎందుకు ..జగన్ కు దూరమైనట్లుగా క్రియేట్ చేసిన సీన్ల తర్వాత ఆయన జనసేన లేదా టీడీపీలో చేరాలని అనుకున్నారు. కానీ జనసేన, టీడీపీల తలుపులు ఆయనకు దాదాపు మూసుకుపోయిన తరుణంలో, బీజేపీ మాత్రమే ఆయనకు ఏకైక మార్గం. కానీ, ఏళ్ల తరబడి జగన్ నీడలా సాగిన వ్యక్తి ఒక్కసారిగా మనసు మార్చుకున్నారంటే అది రాజకీయ అవసరమా లేక పక్కాగా సిద్ధం చేసిన స్క్రిప్టా అన్నదే అసలు పాయింట్. ఒ విజయసాయిరెడ్డి ఢిల్లీ పర్యటనలు, బీజేపీ అగ్రనేతలతో చర్చలు సఫలమైతే.. రాబోయే రోజుల్లో కూటమి ఐక్యత నిలుపుకోవడానికి చాలా కష్టపడాల్సిందే.
