ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండానే బయట రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్లిపోతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు గట్టి షాక్ ఇచ్చారు. ఈసారి అటువంటి మోసానికి తావులేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డిజిటల్ అటెండెన్స్ వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం సభ్యులు కేవలం రిజిస్టర్లో సంతకం చేస్తే సరిపోదు, సభ లోపలికి వచ్చి తమ కేటాయించిన సీట్లలో కూర్చుంటేనే ఫేస్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా హాజరు నమోదవుతుంది.
60 రోజుల పనిదినాల నిబంధన ప్రకారం సభ్యత్వం రద్దు కాకుండా ఉండేందుకు వైసీపీ సభ్యులు సభకు రాకుండా రిజిస్టర్ లో సంతకాలు చేసి వెళ్తున్నారు. కానీ స్పీకర్ తెచ్చిన కొత్త నిబంధనతో ఇప్పుడు వారు కచ్చితంగా సభ లోపలికి రావాల్సిందే. సభలోకి అడుగుపెట్టారంటే అది అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లే అవుతుంది.
గవర్నర్ ప్రసంగం సమయంలో సభకు హాజరై, ఆ తర్వాత వెళ్ళిపోవాలని భావిస్తున్న వైసీపీ నేతలకు ఈ డిజిటల్ నిఘా కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సభలో తమ సీట్లలో కూర్చుని అటెండెన్స్ రికార్డ్ చేయించుకోకపోతే, వారు గైర్హాజరైనట్లుగానే పరిగణిస్తారు. వరుసగా ఇలా జరిగితే అనర్హత వేటు పడే ప్రమాదం ఉండటంతో, వైసీపీ సభ్యులు ఇష్టం లేకపోయినా సభలో కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
