గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని పరిపాలనాపరంగా మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నగర అవసరాలను దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీని మూడు స్వతంత్ర మున్సిపల్ కార్పొరేషన్లుగా మార్చింది. GHMC, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లుగా విభజిస్తూ ప్రభుత్వం బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు విభాగాలకు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్‌ను స్పెషల్ ఆఫీసర్‌గా నియమించింది.
విభజన ఉత్తర్వులు వెలువడిన వెంటనే ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారులకు కమిషనర్లుగా బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న ఆర్వీ కర్ణన్ అదే పదవిలో కొనసాగుతుండగా, కొత్తగా ఏర్పాటైన సైబరాబాద్ కార్పొరేషన్ కమిషనర్‌గా సృజన, మల్కాజ్గిరి కార్పొరేషన్ కమిషనర్‌గా వినయ్ కృష్ణా రెడ్డిలను నియమించింది. వీరు ముగ్గురూ బుధవారం ఉదయమే తమ బాధ్యతలను స్వీకరించారు.
నగర పాలనలో మార్పులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 10 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అత్యంత కీలకమైన సింగరేణి కాలరీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి జ్యోతి బుద్ధ ప్రకాష్‌ను నియమించింది. ఇప్పటివరకు ఇన్ఛార్జ్ సీఎండీగా ఉన్న కృష్ణ భాస్కర్‌ను ఆ బాధ్యతల నుండి తప్పించి, పూర్తిస్థాయి అధిపతిని నియమించడం గమనార్హం.
గ్రేటర్ హైద్రాబాద్ కార్పొరేషన్ పదవి కాలం ముగియగానే కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. త్వరలోనే ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. వచ్చే మూడు, నాలుగు నెలల్లో ఎన్నికలు కూడా పూర్తి చేసి .. అన్ని కార్పొరేషన్లకు పాలకవర్గాలను కొలువు దీర్చే అవకాశం ఉంది.
