ఆంధ్రప్రదేశ్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం వేగంగా కార్యరూపం దాల్చుతోంది. విశాఖపట్నం , అనకాపల్లి జిల్లాల్లో ప్రతిష్టాత్మకమైన ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం భూ కేటాయింపులను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో నిర్ణయించిన 480 ఎకరాలను ఇప్పుడు 601.4 ఎకరాలకు పెంచుతూ సవరించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ విస్తరణతో ఉత్తరాంధ్ర ముఖచిత్రం ఐటీ రంగంలో ప్రపంచ స్థాయికి చేరనుంది. ఇప్పచికే భూసేకరణ పూర్తయింది. అందరికీ పరిహారం పంపిణీ చేశారు.
మూడు వ్యూహాత్మక ప్రాంతాల్లో భూ కేటాయింపులు
ఈ భారీ ప్రాజెక్టు కోసం మూడు ప్రధాన ప్రాంతాల్లో భూములను కేటాయించారు. అత్యధికంగా తర్లువాడలో 266.6 ఎకరాలు, అడవివరం , ముడసర్లోవ పరిధిలో 160 ఎకరాలు, అలాగే అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 174.8 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. రైడెన్ ఇన్ఫోటెక్ తరపున భూ సంబంధిత వ్యవహారాలను పర్యవేక్షించే భాగస్వామ్య సంస్థ అయిన అదానీ ఇన్ఫ్రా (ఇండియా) లిమిటెడ్‌కు ఈ భూములను అప్పగించారు. ఈ కేటాయింపుల ద్వారా డేటా సెంటర్ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం కానుంది.
పెరిగిన విస్తీర్ణం.. మారుతున్న ఐటీ స్వరూపం
ప్రపంచవ్యాప్తంగా ఏఐ డేటా వినియోగం పెరుగుతున్నందున, ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచేందుకే భూ కేటాయింపులను 480 ఎకరాల నుంచి 601.4 ఎకరాలకు పెంచినట్లు తెలుస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ ఏఐ డేటా సెంటర్ కేవలం డేటా నిల్వకే పరిమితం కాకుండా, గ్లోబల్ టెక్ కంపెనీలకు సర్వీస్ హబ్‌గా మారనుంది. దీనివల్ల విశాఖపట్నంలో ఐటీ ఎకోసిస్టమ్ మరింత బలోపేతం కావడమే కాకుండా, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తరలివచ్చే అవకాశం ఉంది. ఏఐ సమ్మిట్ లో పాల్గొన్న గూగూల్ సీఈవో ఇదే విషయాన్ని చెప్పారు.
యువతకు ఉపాధి కల్పనలో కీలక మలుపు
ఈ డేటా సెంటర్ ప్రాజెక్ట్ విస్తరణ ద్వారా వేల సంఖ్యలో ప్రత్యక్ష , పరోక్ష ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా ఐటీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మరియు డేటా అనలిటిక్స్ రంగాల్లో నిపుణులైన స్థానిక యువతకు ఇది పెద్ద వరంగా మారనుంది. ఉత్తరాంధ్రలో పారిశ్రామికాభివృద్ధితో పాటు సాంకేతిక విప్లవాన్ని తీసుకురావాలన్న ప్రభుత్వ లక్ష్యం ఈ ప్రాజెక్టుతో నెరవేరనుందని ఐటీ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
