టాలీవుడ్ క్యాలెండర్లో త్రైమాసికం ముగిసింది. ఈ మూడు నెలల ఫలితాలు చూసుకుంటే పండగ సీజన్ తప్ప మిగతా రెండు నెలలు పెద్దగా కలిసిరాలేదు. ఇప్పుడు సమ్మర్‌పై అందరి దృష్టి పడింది. ఏప్రిల్ సినిమాల జాబితా ఆశాజనకంగా ఉంది. బాక్సాఫీస్ వద్ద అద్భుతం చేయగల సినిమాలు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి.
ఏప్రిల్ 3న రెండు చెప్పుకోదగ్గ సినిమాలు వస్తున్నాయి. శర్వా ‘బైకర్’తో వస్తున్నాడు. ఇండియాలో తొలి మోటార్ క్రాస్ జానర్ సినిమా ఇది. ఈ సినిమా కోసం ఏకంగా 23 కేజీల బరువు తగ్గాడు శర్వా. అంతేకాదు, రియల్ రేసర్స్‌తో షూట్ చేశారు. ఇలాంటి కొత్త జానర్‌కు ప్రొడక్షన్ చాలా రిస్క్. అయినప్పటికీ ఖర్చుకు వెనకాడకుండా విదేశీ రేసింగ్ ట్రాక్స్‌పై యాక్షన్ సన్నివేశాలు తీశారు. కేవలం యాక్షన్ సన్నివేశాలకే రెండు నెలలు సమయం పట్టింది. టెక్నికల్‌గా హాలీవుడ్ రేంజ్లో సినిమా వచ్చిందని టాక్ వినిపిస్తోంది. బంపర్ బ్లాక్‌బస్టర్ కొడతామని స్వయంగా శర్వా ప్రకటించడం ఈ సినిమాపై టీమ్‌కు ఉన్న నమ్మకాన్ని చూపిస్తోంది.
సంగీత్ శోభన్ నటించిన ‘రాకాస’ సినిమా కూడా అదే తేదీకి వస్తోంది. ఇది ఫాంటసీ కామెడీ-హారర్ జానర్ సినిమా. ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తికరంగా ఉంది. సంగీత్ శోభన్ మంచి టైమింగ్ ఉన్న నటుడు. ‘మ్యాడ్’ సినిమా విజయంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. పైగా ఈ సినిమాను నిర్మించిన నిహారిక, తొలి సినిమా ‘కమిటీ కుర్రాళ్లు’తో తన అభిరుచిని చాటుకుంది. నిహారిక నుంచి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా విషయం ఉంటుందనే నమ్మకం చాలా తక్కువ కాలంలోనే సంపాదించుకుంది. పైగా హారర్-ఫాంటసీ-కామెడీ మంచి డిమాండ్ ఉన్న జానర్. సినిమాకు హిట్ టాక్ వస్తే మంచి ఫుట్‌ఫాల్స్ చూసే అవకాశం ఉంది.
ఏప్రిల్ 10న అడివి శేష్ ‘డెకాయిట్ తో వస్తున్నాడు. శేష్ ట్రాక్ రికార్డ్ బాగుంది. ఆయన ఒక సినిమా పట్టుకుంటే రైటింగ్ నుంచి ప్రతి విభాగంలో ఇన్వాల్వ్ అవుతూ ప్రాజెక్ట్‌ను ముందుకు నడిపిస్తాడు. అదే ఆయనకు మంచి విజయాలు తీసుకొచ్చింది. ఇప్పుడు ‘డెకాయిట్’ కథను కూడా ఆయనే సిద్ధం చేసుకున్నాడు. అన్నపూర్ణ బ్యానర్‌పై సుప్రియ నిర్మించింది. ఆ సంస్థ నుంచి సినిమా అంటే ఖచ్చితంగా కంటెంట్‌లో క్వాలిటీ ఉంటుంది. పైగా ఈ సినిమాను తెలుగు, హిందీలో తెరకెక్కించారు. మృణాల్, అనురాగ్ కశ్యప్ లాంటి బాలీవుడ్ ఆకర్షణ కూడా ఉంది. డబ్బింగ్‌లా కాకుండా రెండు భాషలకు విడిగా షూటింగ్ చేశారు. ‘మేజర్’కి హిందీలో మంచి స్పందన వచ్చింది; ఆ విజయాన్ని ‘డెకాయిట్’తో కొనసాగించాలని చూస్తున్నాడు శేష్.
నిఖిల్ ‘స్వయంభూ’ కూడా ఏప్రిల్ లోనే రావచ్చు. ఇప్పటివరకు నిఖిల్ కెరీర్లో హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా ఇది. టీజర్ ఎపిక్ స్కేల్లో ఉంది. ‘కార్తికేయ’ విజయం నిఖిల్‌కు కొత్త మార్కెట్‌ను తెరిచింది. ఆ నమ్మకంతోనే పాన్ ఇండియా స్థాయిలో సినిమాను తెరకెక్కించారు. విజువల్‌గా సినిమా లావిష్‌గా కనిపిస్తోంది. ‘బాహుబలి’కి పని చేసిన సెంథిల్ కెమెరా వెనుక ఉండటం మరో ఆకర్షణ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడితే మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది.
ఏప్రిల్ 17న మూడు సినిమాలు ఉన్నాయి. నాగశౌర్య చాలా గ్యాప్ తర్వాత ‘బాడ్ బాయ్ కార్తీక్’తో వస్తున్నాడు. నిజానికి ఈ సినిమాకు పెద్దగా హైప్ లేదు. షూటింగ్ కూడా వాయిదాలు పడుతూ జరిగింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఒక్క ఈవెంట్ కూడా జరగలేదు. అయితే జీ స్టూడియోస్ ఈ సినిమాను విడుదల చేస్తుండటంతో బిజినెస్ పరంగా కొంత సేఫ్. ఈవిన్ నిర్మించిన ‘పాపం ప్రతాప్’ కూడా ఇదే తేదీకి వస్తోంది. తిరువీర్ ఇందులో హీరో. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలతో మ్యాజిక్ చేయడం ఈవిన్ స్పెషాలిటీ. ఈ సినిమా కూడా అలాంటి మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి. అలాగే ‘తిమ్మరాజు పల్లి టీవీ’ అనే మరో చిన్న సినిమా కూడా ఇదే తేదీకి ఉంది. కిరణ్ అబ్బవరం ఈ చిత్రానికి నిర్మాత.
తుఫాన్ ముందు వచ్చే నిశ్శబ్దంలా ఏప్రిల్ 30 వరకూ మరో సినిమా లేదు. అదే తేదీకి రామ్ చరణ్ ‘పెద్ది’తో దిగుతున్నాడు. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించగల సినిమా ఇది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కంటెంట్ వైరల్ అయింది. ‘పెద్ది’ ఫస్ట్ గ్లింప్స్, ‘చికిరి’, ‘రైరై’ పాటలు, అలాగే ఇటీవల విడుదలైన ‘పెద్ది పహిల్వాన్’ వీడియో సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం కళ్లముందే కనిపిస్తోంది. బుచ్చి బాబు ఫ్యాన్స్‌కే కాదు, సినిమాకు అవసరమైన ప్రతిదాన్ని ‘పెద్ది’ కోసం సమకూర్చాడని ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ చూస్తే అర్థమవుతోంది. ఏప్రిల్ 30 కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే ‘పెద్ది’ ఆ తేదీకి వస్తుందా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ టీమ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి మార్పు ప్రకటన లేదు. ఇటీవల చరణ్ గాయపడిన సందర్భంలో కూడా ఏప్రిల్ 30కే రిలీజ్ అని నిర్మాతలు మరోసారి స్పష్టం చేశారు. ఎప్పుడొచ్చినా బాక్సాఫీస్‌ను షేక్ చేయగల సత్తా ఉన్న సినిమా ఇది. పెద్ది రాకపోతే ఆ డేట్ క్యాష్ చేసుకోవాలని కొన్ని సినిమాలు ఎదురు చూస్తున్నాయి.
మొత్తానికి ‘పెద్ది’తో కలిపి చూస్తే ఏప్రిల్‌లో టాలీవుడ్ సందడి బాగానే కనిపిస్తోంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఉన్న లోటును ఏప్రిల్ భర్తీ చేస్తుందని ఆశిద్దాం.
