రివ్యూ : రూల్ బ్రేకింగ్ ల‌వ్ స్టోరీ… అర్జున్ రెడ్డి

తెలుగు360.కామ్ రేటింగ్ : 3.75/5

  • అన్ని సినిమాలూ ఒకేలా ఉండ‌వు!
  • కొన్ని సినిమాలు అప్పుడ‌ప్పుడు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తాయి.
  • ఇందులో ఏం లేదు క‌దా?? అనిపిస్తున్నా… ఏదో ఉంటుంది.
  • కొత్త‌గా ఏముంది? అనిపిస్తున్నా…. ఏదో క‌నిపిస్తుంటుంది.
  • అలాంటి సినిమాల జాబితా రాస్తే – అర్జున్ రెడ్డి పేరు కూడా అందులో చేరుతుంది.

సినిమా ఇలానే ఉండాల‌న్న రూల్ లేదు. ఓ క‌థ‌ని ఎవ‌రు, ఏ తీరులో అయినా చెప్పొచ్చు. ఎలాగైనా న‌డిపించొచ్చు. కానీ ఒక్క‌టే రూల్‌… అది అంతిమంగా ప్రేక్ష‌కుడికి న‌చ్చాలి. వాళ్లని సంతృప్తి ప‌ర‌చాలి. అయితే ఓ క‌థ‌ని కొత్త‌గా చూపించే ప్ర‌య‌త్నంలో కొన్ని తప్పులు జ‌రుగుండొచ్చు. కానీ… ఆ ప్ర‌య‌త్నం మాత్రం మెచ్చుకోద‌గిన‌ది. అర్జున్ రెడ్డిని కూడా!

అర్జున్ రెడ్డి ఇంట్ర‌వెల్ చూడండి షాక్ తింటారు. ఇలాంటి షాట్ తెలుగు సినిమాలో చూసుండ‌రు. బ‌హుశా చూడ‌క‌పోవొచ్చు. అలాంటి ఊహ ద‌ర్శ‌కుడికి రావ‌డం (బ‌హుశా కొంత‌మందికి ఇదేంట్రా బాబు అనిపించి ఉండొచ్చు), దాన్ని విజ‌య్ దేవ‌ర కొండ అమ‌లు ప‌ర‌చ‌డం నిజంగా మెచ్చుకోద‌గిన విష‌యాలు. అర్జున్ రెడ్డి కొత్త‌దారిలో వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించాడు అన‌డానికి అదో ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే! ఇంకాస్త విపులంగా చెప్పుకొంటే…

* క‌థ‌
అర్జున్ రెడ్డి (విజ‌య దేవ‌ర‌కొండ‌) ఓ మెడికో. కోపం ఎక్కువ‌. చ‌దువులో టాప్‌. కోపంలో కూడా. ఆ కోపంతోనే కాలేజీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయే ప‌రిస్థితి తెచ్చుకొంటాడు. కానీ.. అదే రోజున కాలేజీలో చేరిన కీర్తి శెట్టి (షాలిని)ని చూసి ఆగిపోతాడు. షాలిని త‌న జూనియ‌ర్‌. ఆమెను తొలి చూపులోనే ప్రేమించేస్తాడు. ఆమె కూడా ఇష్ట‌ప‌డుతుంది. అయితే.. దీప్తి ఇంట్లో మాత్రం వీరిద్ద‌రి పెళ్లికి ఒప్పుకోరు. దీప్తికి మ‌రో పెళ్లి చేసేస్తారు. ఆ బాధ‌లో అర్జున్ రెడ్డి ఏమ‌య్యాడు?? దీప్తిని మ‌ర్చిపోయాడా? త‌న కోపాన్ని త‌గ్గించుకొన్నాడా?? ఇదంతా మిగిలిన స్టోరీ!

* విశ్లేష‌ణ‌
క‌థ‌గా వింటుంటే ఏముంది ఇందులో అనిపిస్తుంది. ద‌ర్శ‌కుడు కూడా అలానే అనుకొంటే.. ఇది కూడా సాదా సీదా ల‌వ్ స్టోరీలా మారిపోదును. అర్జున్ రెడ్డి అనే యాటిట్యూడ్, అత‌ని కోపం, అత‌ని పంతం, పిచ్చి, ప్రేమ‌, అత‌ని వ్యస‌నం దాని చుట్టూ అల్లుకొన్న ఓ ప్రేమ‌క‌థ ఉంది. అందుకే.. ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి కోణంలోంచి చూస్తే ఈ క‌థ‌లో మూడు గంట‌ల సినిమా ఉంది. ఏ సినిమాకైనా ట్రీట్ మెంట్ ముఖ్యం. సాదా సీదా క‌థ‌ల‌కు మ‌రీ మ‌రీ అవ‌స‌రం. ఆ ట్రీట్‌మెంట్ ని న‌మ్ముకొన్న సినిమా ఇది. మెడికోల జీవితం, హాస్ట‌ల్ వ్య‌వ‌హారాలు, కాలేజీ సంగతులు తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా త‌క్కువ తెలుసు. దాన్ని పూర్తి స్థాయిలో చూపించాడు ద‌ర్శ‌కుడు. అర్జున్ రెడ్డి క్యారెక్ట‌రైజేష‌న్‌, బిహేవియ‌ర్ చూపించ‌డానికి చాలా స‌న్నివేశాలు వాడుకొన్నాడు ద‌ర్శ‌కుడు. ఆ త‌ర‌వాత ల‌వ్ స్టోరీ మొద‌ల‌వుతుంది. అది ముదిరిపాకాన ప‌డిన త‌ర‌వాత‌.. పెద్ద‌లు అడ్డు రావ‌డం – ఇంట్ర‌వెల్‌. ఇంత స‌న్న‌ని క‌థ‌లో త‌న ట్రిట్‌మెంట్‌తో ప్ర‌తిభ చాటుకొనే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. చాలా స‌న్నివేశాలు బోల్డ్‌గా క‌నిపిస్తాయి. మాట‌లూ అలానే వినిపిస్తాయి. అమ్మాయి `నెల‌స‌రి` స‌మ‌స్య గురించి కూడా ఓ సుదీర్ఘ డైలాగ్ ఉంది ఈ సినిమాలో. అయితే దానికి కామెడీ ట‌చ్ ఇచ్చి… సున్నిత‌మైన విష‌యానికి కూడా క్లాప్స్ కొట్టించేలా చేశాడు ద‌ర్శ‌కుడు. ప్ర‌తీ స‌న్నివేశాన్ని చాలా స‌హ‌జంగా చూపించ‌డానికి ప్ర‌య‌త్నించాడు ద‌ర్శ‌కుడు. అయితే ఆ స‌హ‌జ‌త్వం అక్క‌డ‌క్క‌డా శ్రుతి మించ‌డం ఇబ్బందే. హీరో హీరోయిన్లు క‌లిసి క‌నిపిస్తే చాలు.. అక్క‌డోలిప్ లాక్ స‌న్నివేశం ఆశించేయొచ్చు. ఆ ముద్దులేం పైపైన పెట్టుకొన్న డూప్లికేట్ ముద్దులు కాదాయె. లోలోతుల లిప్ లాక్‌లు. అస‌లు ఇన్ని లిప్ లాక్ ముద్దు స‌న్నివేశాలు తెలుగు సినిమాల్లో ఇది వ‌ర‌కు చూళ్లేదు. ఆ విధంగా… అర్జున్ రెడ్డి రికార్డు సృష్టించిన‌ట్టే. ఈ సినిమా పిల్ల‌ల‌కు కాదు.. అని విజ‌య్ దేవ‌ర కొండ ముందే చెప్పేశాడు కాబట్టి `పెద్ద‌లు` మాత్రం నిర‌భ్యంత‌రంగా చూసేయొచ్చు.

ప్రేమించిన అమ్మాయి దూర‌మ‌య్యాక సినిమాలో ఫ్లేవ‌ర్ మారుతుంది. హీరో బాధ‌ని చూపిస్తూ చూపిస్తూ…. ఆడియ‌న్‌ని కూడా బాధించేశాడు ద‌ర్శ‌కుడు. హీరో ఫ్రెండ్ శివ పాత్ర తో చెప్పించిన డైలాగులు బాగా పేలాయి. అయితే ఓ పాట‌లో చూపించాల్సిన స‌న్నివేశాల‌న్నీ ఓ గంట పాటు స‌న్నివేశాలుగా మ‌లిచాడు. దాంతో.. ఫ‌స్టాఫ్ ఉన్న ఫీల్, ఫ‌న్ సెకండాఫ్‌లో కాస్త త‌గ్గించిన‌ట్టు అనిపిస్తాయి. అయితే ఆ ఎమోష‌న‌ల్ ఫీల్ మాత్రం కంటిన్యూ చేయించాడు,.

ఓ సినిమా హీరోయిన్‌తో అర్జున్ రెడ్డి ఎఫైర్ (?) న‌డ‌ప‌డం, అర్జున్ రెడ్డి వృత్తి జీవితంలో ఎదుర‌య్యే స‌మ‌స్య‌లు.. ఇవ‌న్నీ అర్జున్ రెడ్డి ప్రేమ‌క‌థ కు కాస్త దూరంగా ఉన్న‌ట్టు అనిపించినా… హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ఎలాంటిదో స్ట్రాంగ్ గా చెప్ప‌డానికి వాటిని వాడుకొన్నాడు. ఓ ద‌శ‌లో హీరో ఇలా ఎందుకు ప్ర‌వ‌ర్తిస్తున్నాడు? క్ర‌మంగా సైకో గా మారిపోతున్నాడా? పిచ్చోడు అయిపోతాడా? ఇలా లేని పోని డౌట్లు వ‌చ్చేస్తాయి. హీరో క్యారెక్ట‌రైజేష‌న్ పై కూడా అనుమానాలు మొద‌ల‌వుతాయి. ఈ క‌థ‌ని ద‌ర్శ‌కుడు ఎలా ముగిస్తాడా?? అనిపిస్తుంది. అయితే… ముగింపు మాత్రం ఆక‌ట్టుకొంటుంది. ఈ క‌థ‌ని ఇలా ముగించ‌డ‌మే స‌రైన‌దేమో అనిపిస్తుంది. కావాలంటే ద‌ర్శ‌కుడు భారీ ఎమోష‌న‌ల్ క్లైమాక్స్ రాసుకోవొచ్చు…. యాంటీక్లైమాక్స్‌కీ చోటుంది. కానీ ఆ దిశ‌గా ఆలోచించ‌క‌పోవ‌డం మంచిదే అయ్యింది.

* న‌టీన‌టులు
ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, పెళ్లి చూపులు.. ఇప్పుడు ఈ అర్జున్ రెడ్డి. సినిమా సినిమాకీ.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ న‌ట‌న‌లో ప‌రిణితి క‌నిపిస్తోంది. అర్జున్ రెడ్డి లో పీక్స్ చూపించేశాడు. ఓ మెడికో స్టూడెంట్‌గా, ప్రేమికుడిగా, కోపిస్టిగా, వ్య‌స‌న ప‌రుడిగా.. ఇలా చాలా చాలా షేడ్స్ త‌న‌లో చూపించాడు. లెంగ్తీ సీన్ల‌లోనూ అద్భుతంగా న‌టించాడు. క‌థానాయిక షాలినిని ఫ‌స్ట్ షాట్‌లో చూస్తే రాంగ్ ఛాయిస్ అనిపిస్తుంది. కానీ… త‌నే ఈ సినిమాకి, ఈ పాత్ర‌కి క‌రెక్ట్ అనిపించింది. పెళ్లి చూపులు సినిమాలో ప్రియ‌ద‌ర్శి ఎంత హెల్ప్ అయ్యాడో ఈ సినిమాలో క‌నిపించిన శివ అంత హెల్ప్ అయ్యాడు. త‌న తెలంగాణ‌
డైలాగులు కేక పుట్టిస్తాయి. చిన్న చిన్న రోల్స్ అయినా… అందులో న‌టించిన వాళ్లంతా ఆయా పాత్ర‌ల్లో ఇమిడిపోయారు. చాలా కాలం త‌ర‌వాత సీనియ‌ర్ న‌టి కాంచ‌న ఈ సినిమాలో న‌టించారు. ఆమె వ‌య‌సుకు, హుందాత‌నానికి త‌గిన పాత్ర ఇచ్చారు.

* సాంక‌తిక వ‌ర్గం
పాట‌లు ఉన్నాయా, లేదా అనిపిస్తుంది. కానీ స‌న్నివేశానికి త‌గ్గ‌ట్టు పాట‌ల్ని వాడుకొన్నాడు ద‌ర్శ‌కుడు. నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకొంటుంది. ద‌ర్శ‌కుడి టేస్ట్ ఈ సినిమాలో తెలిసింది. అత‌నిలో టాలెంట్ ఉంది. అయితే దాన్ని కాస్త జాగ్ర‌త్త‌గా వాడుకోవాలి. ఓ స‌న్నివేశాన్ని ఎంత వ‌ర‌కూ చెప్పాలి అనే విష‌యంలో కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాలి. స్వీయ నియంత్ర‌ణ ముఖ్యం. అది త‌ప్పింది. అందుకే ఈ సినిమా మూడు గంట‌లు వ‌చ్చింది. తీసి ప‌క్క‌న పెట్టొచ్చు అన‌ద‌గ్గ స‌న్నివేశాలు ఇందులో కొన్ని క‌నిపిస్తాయి. అవి తొల‌గించుకొంటే.. సినిమాలో మ‌రింత‌ స్పీడు వ‌చ్చేది.

* ఫైన‌ల్ ట‌చ్ : అర్జున్ రెడ్డి – కుర్రాళ్లూ రెడీ అయిపోండి!!

తెలుగు360.కామ్ రేటింగ్ : 3.75/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com