‘అశ్వ‌ద్ధామ’ ట్రైల‌ర్‌: సూత్ర‌ధారి కోసం వేట‌

నాగ‌శౌర్య అంటే ప్రేమ‌క‌థ‌లే గుర్తుకు వ‌స్తాయి. త‌న కెరీర్‌లో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌న్నీ అవే. సొంత సంస్థ‌లో తీసిన ‘ఛ‌లో’ కూడా ఓ ప్రేమ‌క‌థే. అయితే ఈసారి నాగ‌శౌర్య రూటు మార్చాడు. ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ని ఎంచుకున్నాడు. అదే ‘అశ్వ‌ద్ధామ‌’. ఉమెన్ ట్రాఫికింగ్ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ఈ క‌థ‌ని స్వ‌యంగా నాగ‌శౌర్య‌నే రాశాడు. త‌న స్నేహితుడు ర‌మ‌ణ తేజ‌కు ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గించాడు. ఈ సినిమాపై ముందు నుంచీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. టీజ‌ర్‌లో ఆశ‌లు పెరిగాయి. ఇప్పుడు ట్రైల‌ర్‌తోనూ ఆ ఆశ‌ల్ని, అంచ‌నాల్నీ స‌జీవంగా ఉంచాడు నాగ‌శౌర్య‌.

“రాక్ష‌సుడినీ, భ‌గ‌వంతుడినీ చూసిన క‌ళ్లు…. ఇక ఈ ప్ర‌పంచాన్ని చూసే అర్హ‌త కోల్పోతాయి” – అనే డైలాగ్‌తో ఈ ట్రైల‌ర్ మొద‌లెట్టారు. ట్రైల‌ర్ అంతా ఇంటెన్స్‌గా సాగింది. తెర‌పై స్క్రీన్ ప్లే ఏ ర‌కంగా సాగుతుందో తెలీదు గానీ, ట్రైల‌ర్ మాత్రం ప‌రుగులు పెట్టేలా ఉంది. త‌న చెల్లాయి ఉనికిని తెలుసుకోవ‌డానికి ఓ అన్న చేసిన ప్ర‌య‌త్నం ఇది. ఆడ‌పిల్ల‌ల కిడ్నాపులు, వాటి వెనుక ఉన్న ముఠా – ఆ గుట్టు ర‌ట్టు చేసే పాత్ర‌లో నాగ‌శౌర్య క‌నిపించోతున్నాడు.

ఆడ‌పిల్ల చావుమీద మీకెందుకంత ఇంట్రెస్టు. దాని మీద వంద‌ల క‌థ‌నాలు, వేల అబ‌ద్దాలూ పుట్టించేవ‌ర‌కూ వ‌ద‌ల‌రా.. అనే స‌గ‌టు తండ్రి ఆవేద‌న చూస్తే ఈ సినిమాలోని ఎమోష‌న్ పీక్స్‌లో ఉంద‌ని అర్థం అవుతుంది.

ఎటువెళ్తున్నా మూసుకుపోయే దారులు, ఒక‌రితో ఒక‌రికి సంబంధం లేని వ్య‌క్తులు, వేట‌కుక్క‌లా వెంట‌ప‌డే జాల‌ర్లు, శ‌కునిలాంటి ఓ ముస‌లోడు, వీళ్లంద‌రినీ ఒకే స్టేజీపై ఆడిస్తున్న సూత్ర‌ధారి ఎవ‌రు? – అన్న‌దే ఈ సినిమాలో కీల‌క అంశం. ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌కి కావ‌ల్సిన అన్ని అంశాలూ ట్రైల‌ర్‌లో క‌నిపించాయి. నేప‌థ్య సంగీతం సినిమా మూడ్‌కి త‌గ్గ‌ట్టు సాగుంది. నాగ‌శౌర్య కూడా ఇది వ‌ర‌కెప్పుడూ క‌నిపించ‌ని పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. మ‌రి.. ఈ ప్ర‌య‌త్నం ఎంత వ‌ర‌కూ స‌ఫ‌లీకృతం అవుతుందో తెలియాలంటే ఈనెల 31 వ‌ర‌కూ ఆగాలి. ఎందుకంటే ‘అశ్వ‌ద్ధామ‌’ అప్పుడే విడుద‌ల అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com