“ఓ లీడర్ విజయం సాధిస్తే అతని ఖాతాలోకి వెళ్తుంది, అతను అధికారం చెలాయిస్తే ఆ ఫలాలు ఆ కుటుంబానికి అందుతాయి. మరి అతను అవినీతి చేసి దొరికినా.. తప్పు చేసి జైలుకెళ్లినా అది ఆయన కులానికి జరిగిన అవమానం ఎలా అవుతుంది?”
అయ్యే చాన్సే లేదు కానీ రాజకీయ నేతలు చేస్తున్నారు. తమకు కష్టం వచ్చినప్పుడు .. తమ పార్టీకి ఇబ్బంది వచ్చినప్పుడు ప్రతి అంశాన్ని కులంతో ముడిపెట్టడంలో ఆరితేరిపోయారు. ఒక నాయకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నా, లేదా ఒక అధికారిపై విచారణ జరిగినా.. అది ఆ వ్యక్తి చేసిన తప్పు వల్ల కాకుండా, అతడు ఫలానా కులానికి చెందిన వాడు కాబట్టే జరుగుతోందనే ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇది వ్యవస్థను భ్రష్టు పట్టించడమే కాకుండా, కులాల మధ్య వైషమ్యాలను పెంచుతోంది. అయినా రాజకీయ నేతలు తమ స్వార్థం కోసం వీటిని పెంచుతూనే ఉన్నారు.
విజయాల్లో చెప్పుకోలేని కులం…తప్పుడు పనులు చేసినప్పుడే ఎందుకు!?
ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని పరిణామాలను గమనిస్తే ఈ కుల ఆపాదింపు పరాకాష్టకు చేరినట్లు కనిపిస్తోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అనుచిత వ్యాఖ్యల కారణంగా చర్యలు తీసుకుంటే, దానిని వెంటనే కాపు సామాజిక వర్గానికి జరిగిన అవమానంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. అదే సమయంలో, తాను చంద్రబాబును విమర్శిస్తే దానిని కమ్మ సామాజిక వర్గంపై దాడిగా అన్వయించారంటూ ఆయన చెప్పుకున్నారు. అంటే, రాజకీయ విమర్శలు, వ్యక్తిగత ప్రవర్తన వల్ల వచ్చే చిక్కుల నుంచి తప్పించుకోవడానికి కులాన్ని ఒక రక్షణ కవచంలా వాడుకుంటున్నారు. రాజకీయ నాయకులే కాకుండా, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ఐపీఎస్ అధికారులు సైతం ఇదే ధోరణిని అవలంబించడం ఆందోళనకరం. బీహార్ నుంచి ఏపీకి వచ్చి వివాదాల్లో చిక్కుకున్న ఒక ఐపీఎస్ అధికారి, తనపై కేసులు నమోదైతే అది తనది లంబాడా కులం వల్లనే ఇలా చేశారని వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం. అలాగే పీవీ సునీల్ కుమార్ వంటి అధికారులు తమపై వచ్చే విమర్శలను లేదా విచారణలను నిరంతరం కుల వివక్ష కోణంలోనే చూడటం పరిపాటిగా మారింది. చట్టం తన పని తాను చేసుకుపోవడానికి ప్రయత్నించినప్పుడు, దానిని కులం పేరుతో అడ్డుకోవడం లేదా ప్రజలను తప్పుదోవ పట్టించడం ఒక వ్యూహంగా మారిపోయింది. ప్రతి చిన్న అంశానికి కులాన్ని తగిలించడం వెనుక రాజకీయ పార్టీల స్వార్థ ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ కులం వారికి అన్యాయం జరుగుతోంది.. అండగా నిలబడండి అనే సంకేతాలు పంపడం ద్వారా ఆయా వర్గాల ఓటు బ్యాంకును పదిలపరుచుకోవాలనేది వీరి ఎత్తుగడ. ఇలా చేయడం వల్ల అసలు జరిగిన నేరం లేదా తప్పు మరుగున పడిపోయి, చర్చ అంతా కుల వివాదాల వైపు మళ్లుతుంది. ఇది సమాజంలో సోదరభావాన్ని దెబ్బతీయడమే కాకుండా, యువతలో కూడా కులతత్వాన్ని నరనరాల్లో ఎక్కించే ప్రమాదం ఉంది.
పదవి వచ్చినప్పుడు పంచుకోని కులం, కష్టం వచ్చినప్పుడు మాత్రం గుర్తుకు వస్తుందా?
అది కుల పిచ్చి కాదు, తప్పుల నుంచి తప్పించుకోవడానికి వేసుకునే రాజకీయ ముసుగు. రాజకీయాల్లో అధికారం అనేది ఒక అదృష్టం. ఒక వ్యక్తికి పదవి దక్కినప్పుడు అది అతని ప్రతిభో, అదృష్టమో లేదా పార్టీ విధేయతో అవుతుంది. ఆ సమయంలో సదరు నాయకుడు తన కులంలోని అట్టడుగు వర్గాల గురించి కానీ, వారి ఆర్థిక స్థితిగతుల గురించి కానీ పట్టించుకున్న దాఖలాలు తక్కువ. తన కుటుంబానికి కాంట్రాక్టులు ఇచ్చుకోవడంలోనూ, తన వర్గానికి పదవులు ఇప్పించుకోవడంలోనూ చూపే ఉత్సాహం, తన కులంలోని సామాన్యుడి కష్టాల మీద ఉండదు. కానీ, అదే నాయకుడు ఏదైనా అవినీతి కేసులో ఇరుక్కున్నప్పుడు లేదా పదవి కోల్పోయినప్పుడు మాత్రం వెంటనే తన కులం మీద దాడి జరుగుతోందని రంగు పూస్తారు. ఇది స్వార్థ రాజకీయాల పరకాష్ట. తప్పు చేసినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. విచారణ సంస్థలు నోటీసులు ఇచ్చినప్పుడు అది వ్యక్తిగత అంశం కావాలి. కానీ, నేటి రాజకీయాల్లో అదొక వింత ట్రెండ్‌గా మారింది. ఒక నాయకుడి మీద విచారణ జరిగితే, అది తన కులం మొత్తానికి జరిగిన అవమానంగా చిత్రీకరిస్తూ సెంటిమెంట్ రగిలిస్తారు. సామాన్య ప్రజలు కూడా భావోద్వేగాలకు లోనై, ఆ నాయకుడు చేసిన తప్పులను విస్మరించి, తమ కులం ఉనికి ప్రమాదంలో ఉందన్న భ్రమలో పడిపోతారు. ఇలా నేరాలను కుల గౌరవంతో ముడిపెట్టడం వల్ల అసలైన ప్రజాస్వామ్య విలువలు మంటగలుస్తున్నాయి. రాజకీయ నాయకులు తమను తాము కాపాడుకోవడానికి కులాన్ని ఒక కవచంలా వాడుకుంటారు. ఒక సామాన్యుడు చట్టం ముందు తప్పు చేస్తే అతనికి ఏ కుల సంఘం అండగా నిలబడదు. కానీ, కోట్లు గడించిన నాయకుడు ఇబ్బందుల్లో పడితే మాత్రం వీధుల్లోకి వచ్చి పోరాడమని పిలుపునిస్తారు. నాయకుల విలాసవంతమైన జీవితాల్లో వాటా లేని కులస్థులు, వారిపై కేసులు వచ్చినప్పుడు మాత్రం రోడ్ల మీదకు వచ్చి అరెస్టులు అవ్వడం అత్యంత విచారకరం. ఇది నాయకుడి తెలివితేటలు కాదు, ప్రజల అమాయకత్వాన్ని వాడుకోవడమే. నాయకుడు అనేవాడు కులానికి అతీతంగా ఉండాలి. ఒకవేళ తన కులం గురించే ఆలోచించేవాడైతే, ఆ కులంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించేందుకు సాయపడాలి. దవిలో ఉన్నప్పుడు తన కులానికి రాని గౌరవం, తప్పు చేసి జైలుకు వెళ్తున్నప్పుడు ఎలా వస్తుందో ప్రజలు ఆలోచించాలి.
కులాలన్నీ పార్టీలు, వ్యక్తులకే !
రాజకీయాల్లో ఒక నాయకుడు ఎదిగినా, పడిపోయినా అది ఆయన తీసుకున్న నిర్ణయాలు, అనుసరించిన వ్యూహాలపై ఆధారపడి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తూ, నేటి రాజకీయాల్లో వ్యక్తిగత వైఫల్యాన్ని అతి నైపుణ్యంతో కుల వివక్షగా మార్చే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. తన పదవి ఊడినా, అవినీతి చిట్టా బయటపడినా.. అది తన ఒక్కడికి జరిగిన నష్టంలా కాకుండా, తన మొత్తం కులానికే జరిగిన అవమానంగా రంగు పూయడం ఒక మేధోపరమైన మోసం. ఈ తెలివితేటలతో నాయకుడు తన చుట్టూ ఒక భావోద్వేగ కవచాన్ని నిర్మించుకుంటున్నాడు. ఆ కవచం వెనుక అసలు సత్యం దాగిపోతోంది. ఒక నాయకుడు అధికారంలో ఉన్న ఐదేళ్లూ తన కులంలోని సామాన్యుడికి ఎంత మేలు చేశాడు? ఆ కులంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలొచ్చాయా? పేదరికం పోయిందా? అని ప్రశ్నించుకుంటే సమాధానం శూన్యం. పదవిలో ఉన్నప్పుడు తన కుటుంబ ప్రయోజనాలే పరమావధిగా భావించే నాయకుడికి, ఆపద రాగానే తన కులస్థుల రక్తం గుర్తుకు రావడం విడ్డూరం. తన స్వార్థం కోసం కులాన్ని రోడ్ల మీదకు రప్పించడం, వారిని పోలీసు లాఠీలకు ఎదురువెళ్లేలా చేయడం నేటి రాజకీయ నాయకత్వపు దిగజారుడుతనానికి నిదర్శనం. నాయకుడి అక్రమ సంపాదనలో వాటా లేని సామాన్యుడు, అతని పాపాల్లో మాత్రం భాగస్వామి కావడం దౌర్భాగ్యం. నాయకుడి రాజకీయ పతనాన్ని చూసి అది తమ కులం అంతానికే సంకేతమని భ్రమపడటం కంటే పెద్ద అజ్ఞానం మరొకటి లేదు. కులంలో పుట్టిన ప్రతివాడూ నాయకుడి తప్పులకు బాధ్యుడు కాడు. కానీ నాయకుడు పన్నిన సెంటిమెంట్ వలలో చిక్కుకుని, వాస్తవాలను విస్మరించి కొట్లాడటం ఆ కులానికే చేటు చేస్తుంది. చట్టం తన పని తాను చేసుకుపోతున్నప్పుడు, న్యాయస్థానాల్లో తేల్చుకోవాల్సిన అంశాలను వీధుల్లోకి తెచ్చి సామాజిక ఉద్రిక్తతలు సృష్టించడం వల్ల నష్టపోయేది ఆ కులంలోని యువతే తప్ప, ఏసీ గదుల్లో కూర్చుని రాజకీయాలు చేసే నాయకులు కాదు. కుల అభిమానం ఉండొచ్చు, కానీ అది కుల గుడ్డితనంగా మారకూడదు. తన రాజకీయ ప్రయోజనం కోసం కులాన్ని వాడుకునే నాయకుడిని నువ్వు పదవిలో ఉన్నప్పుడు మాకు ఏం చేశావు? అని ప్రశ్నించే ధైర్యం వచ్చినప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. నాయకుడి రాజకీయ పతనం అనేది ఒక వ్యక్తిగత వైఫల్యం మాత్రమేనని, అది కుల మనుగడకు ఎలాంటి ముప్పు కాదని గుర్తించాల్సిన అవసరం ఉంది. రాజకీయ నేరగాళ్లకు కులం రంగు పూయకుండా, వారిని కేవలం నేరస్థులుగానే చూడగలిగే విజ్ఞతను పౌర సమాజం అలవర్చుకోవాలి. అప్పుడే అమాయకులు రాజకీయ పావులుగా మారకుండా తప్పుకోగలరు.
వాళ్లు చేసే తప్పులకు..కులానికి సంబంధం లేదు !
నిజమైన నాయకుడు తన కులాన్ని, వర్గాన్ని కేవలం ఓట్ల యంత్రాలుగా చూడడు. ఆ కులంలోని పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక వెనుకబాటుతనాన్ని తొలగించి, వారిని సమాజంలో గౌరవప్రదమైన స్థానానికి చేర్చడమే తన లక్ష్యంగా పెట్టుకుంటాడు. విద్య, ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా ఆ కులపు ప్రతిష్ఠను పెంచేవాడే అసలైన ప్రతినిధి. ఒక నాయకుడి వల్ల ఆ కులం మొత్తం గర్వపడాలి తప్ప, అతని అవినీతి వల్ల తలదించుకోకూడదు. కులాన్ని అభివృద్ధి పథంలో నడిపించే నాయకుడు చరిత్రలో నిలిచిపోతాడు. స్వార్థపరుడైన నాయకుడు కులాన్ని కేవలం ఒక రక్షణ కవచం లాగా మాత్రమే వాడుకుంటాడు. నిజాయితీ గల నాయకుడు తప్పు చేస్తే చట్టానికి తలవంచుతాడు, తన వల్ల తన కులానికి చెడ్డ పేరు రాకూడదని భావిస్తాడు. కానీ స్వార్థపరుడు మాత్రం తన కులస్థులను రోడ్ల మీదకు పిలిచి, వారిని తన రక్షణ కోసం పావులుగా వాడుకుంటాడు. ఇది ఒక రకమైన భావోద్వేగ బ్లాక్మెయిల్ నాయకుడి విలాసాల్లో వాటా లేని సామాన్యుడు, నాయకుడి నేరాల్లో మాత్రం భాగస్వామి కావడం వల్ల ఆ కులానికి సమాజంలో గౌరవం పెరగదు సదా, మరింత దిగజారుతుంది. నాయకుడి అక్రమ సంపాదన ఆ కుల ఆస్తి కానప్పుడు, అతని శిక్ష ఆ కుల అవమానం ఎలా అవుతుంది?. కులం పేరుతో రక్షణ పొందే నాయకులు ఉన్నంత కాలం ఆ కులానికి నిజమైన అభివృద్ధి అందదు. ప్రజలు నాయకుడిని తమ ప్రతినిధిగా చూడాలి తప్ప, తమ తప్పులకు ప్రతినిధిగా భావించకూడదు. నాయకుడు కులాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తున్నాడా లేక తనను తాను రక్షించుకోవడానికి కులాన్ని పాతాళానికి తొక్కుతున్నాడా? అని ఆలోచించాల్సిన బాధ్యత ఆ కులంలోని మేధావుల మీద, యువత మీద ఉంది. కుల కవచాల వెనుక దాక్కునే పిరికి రాజకీయాలను తిప్పికొట్టినప్పుడే నిజమైన నాయకత్వం ఉద్భవిస్తుంది.
-రాజకీయ నేతల కుల వ్యాపారంలో పావులుగా మారకూడదు!
కులం అనేది సామాన్యుడికి ఒక సామాజిక నేపథ్యం మాత్రమే, కానీ రాజకీయ నాయకుడికి అది ఒక పక్కా బిజినెస్ మోడల్ . ఎన్నికలు రాగానే కుల గణాంకాలను వల్లెవేస్తూ, వర్గాల మధ్య వైషమ్యాలను నర్మగర్భంగా నూరిపోసే నాయకులు.. అధికారం దక్కాక మాత్రం అదే కులంలోని సామాన్యుడిని విస్మరిస్తారు. అన్ని కులాలు ఓట్లేస్తేనే గెలిచామంటారు. ప్రజల మధ్య ఉండాల్సిన సహోదరభావాన్ని విచ్ఛిన్నం చేసి, వారిని విడదీసి పాలించడం ద్వారా తమ రాజకీయ పీఠాలను భద్రం చేసుకోవడమే పార్టీల అసలు వ్యూహం. సామాన్యుడు తన కులస్థుడికి ఆపద వస్తే సాయం చేసే మానవత్వాన్ని కలిగి ఉంటే, నాయకుడు మాత్రం ఆ ఆపదను తన రాజకీయ లబ్ధికి ఎలా వాడుకోవాలా అని స్కెచ్ వేస్తాడు. ఇక్కడ కులం ప్రజలది కాదు, అది కేవలం నాయకుల అధికార దాహానికి ఒక పావు మాత్రమే.
నాయకులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కులాన్ని ఒక భావోద్వేగ కవచం గా మార్చుకుంటున్నారు. ఒక పార్టీ లేదా ఒక లీడర్ పతనం కావడాన్ని ఆ మొత్తం కులానికే జరిగిన నష్టంగా చిత్రించడం వెనుక ఉన్నది కుల ప్రేమ కాదు, కేవలం స్వార్థపూరిత రాజకీయ రక్షణ తంత్రం. ప్రజలు తమ దైనందిన జీవితాల్లో కలిసిమెలిసి ఉన్నా, రాజకీయ సభలు, సోషల్ మీడియా వేదికల ద్వారా వారి మధ్య కులాల గోడలు కట్టేది ఈ రాజకీయ శక్తులే. అభివృద్ధి, విద్య, వైద్యం వంటి మౌలిక అంశాల గురించి చర్చ జరగకుండా ప్రజల దృష్టిని మళ్లించడానికి కులం అనే మత్తుమందును పార్టీలు నిరంతరం ప్రయోగిస్తుంటాయి. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి, కులాన్ని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే నాయకులను దూరం పెట్టినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం బలపడుతుంది. ఇదంతా ప్రజల చేతుల్లోనే ఉంది.
