వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఫిర్యాదుదారు అయిన సునీతారెడ్డిపై తాజాగా చేసిన విమర్శలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, సాక్ష్యాధారాలు సమర్పించి న్యాయపోరాటం చేస్తున్న బాధితురాలిపైనే ఎదురుదాడి చేస్తున్నారు. అదే సమయంలో అవినాష్ రెడ్డి ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు.
హత్య కేసుల వంటి తీవ్రమైన నేరాల్లో బెయిల్ మంజూరు చేసేటప్పుడు కోర్టులు కొన్ని కఠినమైన షరతులను విధిస్తాయి. ముఖ్యంగా * సు విచారణకు విఘాతం కలిగించకూడదని, సాక్షులను ప్రభావితం చేయకూడదని, కేసు అంశాలపై బహిరంగంగా మాట్లాడకూడదని షరతులు ఉంటాయి. అయితే అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఫిర్యాదుదారుపై ఆరోపణలు చేయడం, సీబీఐ దర్యాప్తుపైనా విమర్శలు చేయడం, షరతుల ఉల్లంఘన కిందకే వస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సునీతారెడ్డిని మరియు ఆమె కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సాక్షులను భయపెట్టేవిగా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. సీబీఐ విచారణ జరుగుతున్న తరుణంలో, ఒక నిందితుడు ఇలా పబ్లిక్ ప్లాట్‌ఫారమ్‌పై తన వాదనను వినిపించడం ద్వారా విచారణాధికారులను , సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బెయిల్ మీద బయట ఉండి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఆయన బెయిల్‌ను రద్దు చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
సునీత దర్యాప్తులో భాగంగా తనకు ఇచ్చిన పత్రాలను పరిశీలించి అందులో ఉన్న లోపాలను వెల్లడించారు. దానికే అవినాష్ రెడ్డికి రోషం ముంచుకొచ్చి.. సంబంధం లేదని ఆరోపణలు చేసి.. ఆమెను మాట్లాడకుండా చేయాలని అనుకుంటున్నారు.
