కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు ఇతర అనుబంధ బిల్లులు లోక్సభలో వీగిపోయాయి. నియోజకవర్గాల పునర్విభజనను మహిళా రిజర్వేషన్లతో ముడిపెడుతూ ప్రభుత్వం తెచ్చిన ఈ ప్రతిపాదనను విపక్ష కూటమి గట్టిగా వ్యతిరేకించింది.
శుక్రవారం సాయంత్రం లోక్సభలో జరిగిన ఓటింగ్లో మొత్తం 489 మంది సభ్యులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రతిపాదనకు అనుకూలంగా 278 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 211 ఓట్లు పడ్డాయి. నిబంధనల ప్రకారం, రాజ్యాంగ సవరణ బిల్లు నెగ్గాలంటే సభలో హాజరై ఓటు వేసిన వారిలో మూడింట రెండు వంతు మెజారిటీ అవసరం. 489 మందిలో 2/3 వంతు అంటే కనీసం 326 మంది మద్దతు ఇవ్వాల్సి ఉండగా, ప్రభుత్వానికి కేవలం 278 ఓట్లు మాత్రమే రావడంతో బిల్లు వీగిపోయినట్లు స్పీకర్ ప్రకటించారు.
బిల్లు వీగిపోవడానికి ముందు జరిగిన చర్చకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానమిచ్చారు. ఈ బిల్లు ఏ రాష్ట్రానికీ నష్టం కలిగించదని, పైగా అన్ని రాష్ట్రాల స్థానాలు పెరుగుతాయని హామీ ఇచ్చారు. చాలా పార్టీలు బిల్లులో యాభై శాతం పెంపు ప్రస్తావన లేకపోవడాన్ని ప్రశ్నించారని ఇప్పటికిప్పుడు బిల్లులో ఆ అంశాన్ని చేరిస్తే మద్దతిస్తారా అని ప్రశ్నించారు. దానికి ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మద్దతు తెలిపారు. కానీ అమిత్ షా..చాయిస్ తీసుకోలేదు. ఓటింగ్ కు వెళ్లిపోయారు.
రాజ్యాంగ సవరణ బిల్లులు ఇలా సభలో వీగిపోవడం అరుదుగా జరిగే పరిణామం. దీంతో ప్రభుత్వం ఇప్పుడు పాత 2023 మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. రాజ్యాంగ సవరణను ఆమోదించేలా మద్దతు సమీకరించడానికి ఎన్డీఏ కూటమి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. సభ్యులను ..సభా వేదికగా విజ్ఞప్తి చేశారు.
