రాజకీయాల్లో చిత్రవిచిత్రాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అలాంటివి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్కువగా చేస్తూంటారు. ఇప్పుడూ అదే చేశారు. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టి, మొదటి మీటింగ్ లోనే తన తండ్రి కేసీఆర్ను విమర్శిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ నేతల కంటే ఎక్కువగా రాజగోపాల్ రెడ్డే ఫీలైపోతున్నారు. తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది అంటూ ఆయన మీడియా ముందు ఆవేదన చెందారు. ఆయన ఆవేదన చూస్తుంటే.. సొంత తమ్ముడి కంటే ఎదురింటి బాబాయ్ కే ఎక్కువ ప్రేమ ఉన్నట్లుందే అన్నట్లుగా జనాలు నోరెళ్లబెడుతున్నారు.
సాధారణంగా ఒకరు పార్టీ పెడితే రాజకీయ ప్రత్యర్థులు విమర్శించడం సహజం. కానీ, రాజగోపాల్ రెడ్డి మాత్రం రాజకీయాన్ని పక్కన పెట్టి పూర్తిగా ఫ్యామిలీ ఎమోషన్స్ లోకి వెళ్లిపోయారు. ఉద్యమకారుడు కేసీఆర్ను విమర్శించడం నాకు బాదేసింది అని ఆయన అంటుంటే.. అసలు ఈయన ఉండేది కాంగ్రెస్ లోనా లేక అండర్ గ్రౌండ్ లో బీఆర్ఎస్ కు ఏజెంట్ గా పనిచేస్తున్నారా అనే డౌట్ చాలా మందికి వచ్చి ఉంటుంది. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ కేసీఆర్ పై సానుభూతి చూపించకుండా విమర్శలు చేసిన రాజగోపాల్ రెడ్డి, ఇప్పుడకస్మాత్తుగా ఆయనపై ఇంత ప్రేమ ఎందుకు కురిపిస్తున్నారో ఎవరికీ అంతుచిక్కడం లేదు.
కవిత రాజకీయ ఎదుగుదల చూసి ఆయనకు కన్ను కుడుతుందో.. లేక కవిత కేసీఆర్ ను తిడితే, ఆ సాకుతో కవితను తిట్టి కేసీఆర్ దృష్టిలో పడాలని ప్లాన్ చేస్తున్నారో కానీ, మొత్తానికి ఆయన రియాక్షన్ మాత్రం ఓవర్ యాక్షన్ లా ఉందని నెటిజన్లు నవ్వుకుంటున్నారు. కవితకు డిపాజిట్ రాదు.. ఆమెతో ఊదు కాలదు” అని సెటైర్లు వేస్తూనే, కేసీఆర్ ను మాత్రం వెనకేసుకొస్తుండటం చూస్తుంటే.. భవిష్యత్తులో రాజగోపాల్ రెడ్డి గారి పొలిటికల్ ప్లాన్స్ లో కారు ఎక్కే ఆలోచన ఏమైనా ఉందేమోనన్న అనుమానం కలగక మానదు.
చివరికి మద్యం కేసులో కవితకు క్లీన్ చిట్ రాలేదని గుర్తు చేస్తూనే, ఆమె తన అన్నపై కోపాన్ని తండ్రిపై చూపడం తప్పని రాజగోపాల్ రెడ్డి హితబోధ చేస్తున్నారు. బిడ్డ తండ్రిని విమర్శిస్తే ఆ ఇంట్లో వాళ్ళు సర్దుకుంటారు కానీ, ఈ మూడో మనిషికి ఎందుకింత ఆరాటం అని పొలిటికల్ సర్కిల్స్ లో జోకులు పేలుతున్నాయి. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి తాజా వెర్షన్ చూస్తుంటే.. బిడ్డ తిట్టింది తండ్రిని.. బాధపడింది మాత్రం రాజగోపాల్ రెడ్డి అన్నట్లుగా మారింది.
