తెలుగుదేశం పార్టీ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో 252 మందితో కూడిన నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం కనులపండువగా జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో నారా లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. సీనియర్ల అనుభవం, యువత ఉత్సాహం మేళవిస్తూ ఎంతో కసరత్తు చేసి ఈ కమిటీలను రూపొందించినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ పోషించిన పాత్రను, కార్యకర్తల సంక్షేమం కోసం ఆయన పడ్డ శ్రమను గుర్తిస్తూనే ఈ అత్యున్నత బాధ్యతను అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు.
టీడీపీలో కార్యకర్తే అధినేత
టీడీపీలో కార్యకర్తే అధినేత అనేది కేవలం నినాదం కాదు, తమ పార్టీ విధానమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక మండల స్థాయి నాయకురాలికి పొలిట్ బ్యూరోలో చోటు కల్పించడం, రామ్మోహన్ నాయుడు, శబరి వంటి యువ నాయకులను జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించడం పార్టీలో వచ్చిన మార్పునకు నిదర్శనమన్నారు. చదువుకున్న వారికి, కష్టపడిన వారికి ప్రాధాన్యతనిస్తూ మహిళా బిల్లుకు అనుగుణంగా మహిళలకు పెద్దపీట వేశామని చెప్పారు. తెలుగుజాతి ఉన్నంత వరకు తెలుగుదేశం అజేయంగా నిలుస్తుందని, ఏ శక్తీ పార్టీని అణచలేదని ధీమా వ్యక్తం చేశారు.
20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా లోకేష్ కృషి
గత ప్రభుత్వ హయాంలో వెంటిలేటర్‌పై ఉన్న ఏపీ ఆర్థిక వ్యవస్థను కేంద్ర సహకారంతో గాడిలో పెడుతున్నామని చంద్రబాబు వివరించారు. నిలిచిపోయిన కేంద్ర పథకాలను పునరుద్ధరించడం, అప్పుల రీ-షెడ్యూలింగ్ వంటి చర్యల ద్వారా వ్యవస్థలను మళ్ళీ నిర్మిస్తున్నామని తెలిపారు. సూపర్ సిక్స్ హామీల అమలుతో పాటు ప్రజలకు చేరువగా సుపరిపాలన అందించేందుకు వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చామని, 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా లోకేష్ కృషి చేస్తున్నారని, ఇప్పటికే ప్రపంచ స్థాయి కంపెనీలు ఏపీ వైపు చూస్తున్నాయని గుర్తుచేశారు.
బాధ్యతతో పని చేయడానికే పదవులు
పదవులు అనేవి కేవలం అలంకారం కాదని, బాధ్యతతో పని చేయాలని నూతన కార్యవర్గానికి పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో పడ్డ కష్టం, కార్యకర్తల పోరాటం తనకు ఎప్పటికీ గుర్తుంటుందని భావోద్వేగానికి గురయ్యారు. రాబోయే రోజుల్లో ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ బలం మరింత పెరగాలని, గత ఎన్నికల కంటే ఎక్కువ ఓట్ల శాతం సాధించేలా ప్రతి ఒక్కరూ కష్టపడాలని దిశానిర్దేశం చేశారు.
