టీడీపీ నేతలు, కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కొన్ని చోట్ల ఫ్లెక్సీల వివాదం, ప్రొటోకాల్ రచ్చలు పెచ్చుమీరుతుండటంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు మీపై ఓ కన్నేసి పెట్టారు.. మీరు ఎవరిని కలుస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది గమనిస్తున్నారు అని హెచ్చరించిన చంద్రబాబు, అధికారం ఉందని ఇగోకు పోతే భవిష్యత్తులో మీరే నష్టపోతారని కచ్చితమైన సందేశాన్ని పంపారు.
క్షేత్రస్థాయిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తల మధ్య ఐకమత్యం దెబ్బతింటున్నట్లు వస్తున్న ఫిర్యాదులపై చంద్రబాబు స్పందిస్తూ.. కార్యకర్తలు చేసే చిన్న చిన్న తప్పులు ప్రభుత్వంపై పెద్ద ప్రభావం చూపుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లెక్సీల దగ్గర గొడవపడటం, వ్యక్తిగత అధిపత్యం కోసం ప్రయత్నించడం వంటి పరిణామాలు తనను ఎంతగానో బాధపెట్టాయని వెల్లడించారు. మనం ఇప్పుడు మూడు పార్టీల కలయికతో కూడిన ఎన్డీఏలో ఉన్నామని, ఈ ఐకమత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి వరకు అందరిపై ఉందని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఉనికిని కాపాడుకోవడమే కాకుండా, కేంద్రానికి మరియు రాష్ట్రానికి ఎక్కడా చెడ్డపేరు రాకుండా పనిచేయాలన్నది తమ సంకల్పమని చంద్రబాబు ఉద్ఘాటించారు. అధిపత్యం కోసం తహతహలాడకండి.. మన ఉనికిని కాపాడుకోవడమే మన ప్రధాన లక్ష్యం కావాలి అని నాయకులకు దిశానిర్దేశం చేశారు. అధికార గర్వంతో విర్రవీగే వారిని ప్రజలు అస్సలు క్షమించరని, వినయం, బాధ్యతతో పనిచేసినప్పుడే ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ కొనసాగుతుందని ఆయన హితబోధ చేశారు.
కూటమిలోని కొందరు అతి ఉత్సాహం చూపే నాయకులకు గట్టి చురకలుగా భావిస్తున్నారు. ఐకమత్యం అనే స్ఫూర్తి పరిమితం కాకుండా ప్రతి గ్రామం వరకు కొనసాగాలని ఆయన పిలుపునిచ్చారు. విభేదాలను పక్కన పెట్టి కూటమి ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వెళ్లని పక్షంలో క్రమశిక్షణ చర్యలు తప్పవన్న హెచ్చరికను కూడా ఆయన పరోక్షంగా అందించారు.
