తమిళ నాట రాజకీయాల్లో విజయ్ పెను సంచలనం సృష్టించారు. కింగ్ మేకర్ నుంచి.. కింగ్ గా మారి, ఇప్పుడు అక్కడ సీఎం కుర్చీలో కూర్చోబోతున్నారు. తమిళ రాజకీయాలు, అక్కడ విజయ్ సృష్టించిన సునామీ దేశ వ్యాప్తంగా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సినిమా వాళ్లు రాజకీయాల్లో రాణించలేరు, సినిమాలు వేరు… రాజకీయాలు వేరు అని ఎద్దేవా చేసిన వాళ్లకు విజయ్ గెలుపే ఓ సమాధానం. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న సినిమా స్టార్లు.. రాజకీయాలవైపు మరింత ఆసక్తి చూపించడం ఖాయం. అంతలా ప్రభావితం చేస్తున్నాడు విజయ్.
అయితే.. విజయ్ గెలుపు మాత్రం రజనీకాంత్ లో ప్రశ్చాత్తాపం కలిగిస్తుందన్న కోణంలోనూ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఎందుకంటే విజయ్ కంటే ముందు రజనీకాంత్ రాజకీయాల్లోకి వద్దామనుకొన్నారు. అందుకు తగిన ఏర్పాట్లూ చేసుకొన్నారు. తరచూ ఫ్యాన్స్ తో మీటింగులు పెట్టేవారు. ‘అదిగో.. ఇదిగో’ అంటూ ఏళ్ల తరబడి ఊరిస్తూ వచ్చారు. కానీ.. చివరికి చేతులెత్తేశారు. పెరిగిపోయిన వయసుని సాకుగా చూపించి, రాజకీయాల్లోకి అడుగు పెట్టకముందే రిటైర్మెంట్ ప్రకటించేశారు. రాజకీయాల్లోకి వస్తే గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. పైగా.. విమర్శల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అందుకే రజనీకాంత్ ధైర్యం చేయలేపోయారు.
కానీ అదే సమయంలో విజయ్ ధైర్యంగా ముందుకు దూకాడు. సోలోగా నిలబడ్డాడు. ఒక్కడే పోరాడాడు. ఫలితం దక్కించుకొన్నాడు. సినిమా వాళ్లకు రాజకీయాల్లోనూ మనుగడ ఉంటుందని నిరూపించాడు. పార్టీ స్థాపించిన అతి తక్కువ సమయంలోనే సీఎం కుర్చీలో కూర్చోబోతున్నాడు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే, ఇలాంటి విజయమే దక్కేదా అనేది కచ్చితంగా ఊహాజనితమైన ప్రశ్నే. కానీ రజనీ తప్పకుండా ప్రభావం చూపించి ఉండేవాడు. కనీసం కింగ్ మేకర్ అయినా అయ్యుండేవాడు. అన్నీ కలిసొస్తే.. విజయ్ లా అధికారాన్ని అందిపుచ్చుకొనేవాడేమో. కానీ.. రజనీ ధైర్యం చేయలేదు. ధైర్యవంతులకు అదృష్టం కలిసి వస్తుందనే ఓ సామెత ఉంది. విజయ్ అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్.


