వైసీపీ నేతలు పూడి శ్రీహరి , గిరిధర్ రెడ్డిలను రిమాండ్ కు పంపేందుకు నిరాకరిస్తూ కుప్పం కోర్టు ఇచ్చిన ఆదేశాలు హైకోర్టు కొట్టివేసింది. దీంతో వారిద్దరూ జైలుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వైసీపీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్ సీపీఆర్వో పూడి శ్రీహరితో పాటు పార్టీ నేత గిరిధర్ రెడ్డిలను సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారానికి సంబంధించి కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని కుప్పం మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, పోలీసుల రిమాండ్ దరఖాస్తును కోర్టు తిరస్కరించింది. నిందితులకు వ్యతిరేకంగా సరైన ఆధారాలు సమర్పించలేదని భావించిన మేజిస్ట్రేట్ కోర్టు, వారికి రిమాండ్ విధించేందుకు నిరాకరించి, వారిని విడుదల చేయాలని ఆదేశించింది.
అయితే, కుప్పం కోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పోలీసులు వెంటనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించిన హైకోర్టు, కుప్పం మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. నిందితులను రిమాండ్కు పంపడానికి నిరాకరించిన కింది కోర్టు ఉత్తర్వులపై స్టే విధించడంతో, ఈ కేసులో పోలీసుల తదుపరి చర్యలకు మార్గం సుగమమైంది.
హైకోర్టు ఆదేశాలతో పోలీసులు ఈ కేసును మరింత వేగవంతం చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారనే ఆరోపణలపై వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, విచారణ నిమిత్తం మళ్ళీ అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే శ్రీహరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ , ల్యాప్ ట్యాపుల్లో కీలక సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంది.
