తెలుగునాట ‘బ్యాన్’ అనే బ్యాగేజీ మోసిన దర్శకుడు ప్రకాష్ రాజ్. తనని మళ్లీ సినిమాల్లోకి తీసుకోవాలని ఆయన నిరాహార దీక్ష కూడా చేశారనుకోండి.. అది వేరే విషయం. ఆ తరవాత మళ్లీ అలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాలేదు. కానీ ఇప్పుడాయన అనధికార బ్యాన్ కి గురి కాబబడతారా? అనే అనుమానం తలెత్తుతోంది. తరచూ ఏదో ఓ వివాదం నెత్తిమీద పెట్టుకోవడం ఆయనకు అలవాటు. తాజాగా రామాయణంపై ఆయన విసిరిన వ్యంగ్య బాణాలు మళ్లీ ఆయన వీపుకే గుచ్చుకొనే ప్రమాదంలో పడ్డారు. ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుల పరంపర మొదలైంది. రామాయణాన్ని అగౌరవ పరిచినందుకు, హిందువులను మనోభావాల్ని దెబ్బ తీసినందుకు ఆయనపై తక్షణం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అంతే కాదు.. ఆయనకు సినిమాల్లో పాత్రలు ఇవ్వకూడదని కూడా పట్టుబడుతున్నారు. ‘ఇలాంటి నటుడ్ని మీ సినిమాల్లో పెట్టుకుంటారా’ అని దర్శకుల్ని హిందుత్వ వాదులు ప్రశ్నిస్తున్నారు.
ఈ ప్రభావం… ఆయన కెరీర్ పై పడే ప్రమాదం కనిపిస్తోంది. తరచూ ఇలాంటి వివాదాల్లోకి దూరితే.. ఆయనపై నెగిటీవ్ ఇంపాక్ట్ పడడం ఖాయం. దర్శకులు కూడా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వ్యక్తిగత అభిప్రాయాలు వేరు, నటన వేరు, రాజకీయం వేరు అనుకుంటే సరే. కానీ ఇవన్నీ ఒకదానితో మరోటి ముడి పెట్టుకొని, ప్రదీదానికీ అర్థాలు, తత్పర్యాలూ వెదుక్కుంటున్న రోజుల్లో ఉన్నాం. ప్రతీదీ మరో దానికి ఇంటర్ లింకే. అలాంటప్పుడు ఏం మాట్లాడినా, వృత్తిగత జీవితంపై ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికిప్పుడు ప్రకాష్ రాజ్ ని ఈ కారణం చెప్పి ఏ పరిశ్రమ బ్యాన్ చేయలేదు. ఆ హక్కు కూడా ఎవరికీ లేదు. కాకపోతే… ప్రకాష్ రాజ్ ఎంపికపై నీలి నీడలు కమ్ముకొనే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి. ప్రకాష్ రాజ్ పై హిందూ వ్యతిరేకి అనే ముద్ర ఎలాగూ ఉంది. ఇప్పుడు దాన్నే చూపించి, ప్రకాష్ రాజ్ నటించే చిత్రాల్ని బ్యాన్ చేసుకొంటూ పోతే, ఆ ప్రభావం సినిమాలపై, ఆ సినిమాలు తీసిన నిర్మాతలపై పడుతుంది.


