ఫ్యాన్స్‌కు ఎమోషన్స్ మాత్రమే ఉంటాయి. లాజిక్స్, లెక్కలతో పని ఉండదు. బాలకృష్ణ అభిమానులు కూడా ఇప్పుడు ఇదే మీటర్ లో ఉన్నారు. డిసెంబరు 5న రావాల్సిన అఖండ 2 వాయిదా పడడంతో ఫ్యాన్స్ చాలా నిరుత్సాహానికి లోనయ్యారు. ప్రీమియర్స్ మరి కొద్ది గంటల్లో అనగా.. అనుకోని అవాంతరం ఎదురై, సినిమా ఆగిపోవడంతో చాలా ఇబ్బంది పడ్డారు. అప్పటికే థియేటర్ల దగ్గరకు చేరుకొని, బ్యానర్లు కట్టి, పాలాభిషేకాలు చేయడానికి సిద్ధమైన ఫ్యాన్స్ అయితే షాక్ కి గురయ్యారు. డిసెంబరు 6నైనా సినిమా విడుదల అవుతుందనుకొన్నారు. కానీ కాలేదు. ఆ తరవాత జరిగిన పరిణామాలు తెలిసిందే.
నిర్మాతలు శత విధాలుగా ప్రయత్నించినా.. కొన్ని అనుకోని అవాంతరాల వల్ల సినిమాని వాయిదా వేయక తప్పలేదు. అయితే అఖండ 2 రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రాకపోవడం ఫ్యాన్స్ ని మరింత బాధిస్తోంది. డిసెంబరు 12, లేదా 25.. ఈ రెండు డేట్లూ వెసులుబాటు ఉన్నాయి. ఏదో ఒకటి ఫిక్సయితే.. ఫ్యాన్స్ రిలాక్స్ అయిపోదురు. కానీ.. ఆ మాత్రం క్లారిటీ కూడా రాకపోయేసరికి వాళ్లలో నిరుత్సాహం ఆవహించింది. దాంతో అఖండ డిసెంబరు 12న రావాల్సిందే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. హ్యాష్ ట్యాగులతో.. హోరెత్తిస్తున్నారు. 12న ఎట్టిపరిస్థితుల్లోనూ విడుదల చేయాలంటే నిర్మాతలకు వార్నింగులు ఇస్తున్నారు.
నిర్మాతలు కూడా అదే పనిలో ఉన్నారు. ఈ సినిమాని వీలైనంత త్వరగా అభిమానులకు చూపించాలన్న పట్టుదలతో పని చేస్తున్నారు. అయితే టెక్నికల్ గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థిక పరమైన లెక్కలు, చిక్కులు కొన్ని దాటుకొని ఈ సినిమాని విడుదల చేయాలి. ఇప్పటికే అడ్వాన్సులు ఇచ్చేసిన బయ్యర్లు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఓటీటీ షరతులు కూడా వెంటాడుతున్నాయి. డిసెంబరు 25 అన్ని విధాలా అనువుగా ఉన్నా, అప్పటి వరకూ ఆగే పరిస్థితి ఉందా, లేదా అనేది చూసుకోవాలి. 12నే సినిమా విడుదల అనుకొంటే, ఈలోగా ఫైనాన్షియర్ల నుంచి క్లియరెన్స్ తెచ్చుకోవాలి. కోర్టు నుంచి ఆమోదం రావాలి.. ఇన్ని చేసుకొన్నా మరోసారి ప్రమోషన్లు మొదలెట్టాలి. మంగళవారం సాయింత్రం లోగా విషయం ఓ కొలిక్కి వస్తే, ఈ వారమే అఖండ 2 చూడొచ్చు. లేదంటే డిసెంబరు 25 వరకూ ఆగాలి. అయితే ఈ లెక్కలు ఫ్యాన్స్ కి పట్టడం లేదు. వాళ్ల ఎమోషన్ వాళ్లదే. కనీసం నిర్మాతలు ఓ డేట్ ఫిక్స్ చేసుకొంటే.. కాస్తో కూస్తో ఈ అసంతృప్తికి కళ్లెం వేసినట్టు అవుతుంది.
