కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఈ వివాదం కేవలం వ్యక్తిగత అంశంగా కాకుండా, రాజకీయ అస్త్రంగా మారడంతో అది బండి సంజయ్‌కు సమస్యగా మారనుంది. అది ట్రాప్ అయినా కావొచ్చు.. మిత్రుల మధ్య గొడవలు అయినా కావొచ్చు.. కానీ నష్టం మాత్రం బండి సంజయ్‌కే జరగనుంది.
వారి స్నేహం అందరికీ తెలిసిందే !
బండి భగీరథ్ మరియు సదరు బాలిక మధ్య గత ఏడెనిమిది నెలలుగా పరిచయం ఉంది. వీరిద్దరూ ఉమ్మడి స్నేహితుల ద్వారా కలుసుకున్నారని, కలిసి పార్టీలు చేసుకోవడం, కుటుంబ వేడుకలకు వెళ్లడం వంటివి జరిగినట్లు తెలుస్తోంది. అంతా సవ్యంగా ఉందనుకున్న సమయంలో, వీరి మధ్య వచ్చిన మనస్పర్థలు చివరకు లైంగిక వేధింపుల ఆరోపణల వరకు వెళ్లాయి. బాలిక వయసు 18 ఏళ్ల కంటే తక్కువ ఉండటంతో, పోలీసులు ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణించి పోక్సో చట్టం కింద పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. భగీరథ్ కూడా కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు బాలిక కుటుంబం తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందని, లేనిపక్షంలో 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
సంజయ్ ఎదుగుదలకు ఆటంకమా?
బండి సంజయ్ కేవలం ఎంపీ మాత్రమే కాదు, తెలంగాణ బీజేపీలో అత్యంత శక్తివంతమైన నాయకుడు. రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం, కేంద్ర మంత్రి హోదా ఉండటంతో భవిష్యత్తులో ముఖ్యమంత్రి రేసులో ఆయన ప్రధాన పోటీదారుగా ఉన్నారు. ఇలాంటి సమయంలో తన కుమారుడి చుట్టూ ఇటువంటి వివాదం ముసురుకోవడం ఆయన రాజకీయ ప్రతిష్టకు పెద్ద దెబ్బే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించడం, పది నెలల పాత అంశాలను సైతం వెలికి తీస్తుండటం చూస్తుంటే సాధారణ కేసుగా ముగిసే అవకాశాలు కనిపించడం లేదు.
రాజకీయాల్లో మంచీ చెడులు ఉండవు!
రాజకీయాలకు మంచీ చెడులు ఉండవు. తమ ప్రత్యర్థుల్ని దెబ్బకొట్టే అవకాశం వస్తే ఒక్కరూ వదిలి పెట్టరు. బండి సంజయ్ ను ఎలాగైనా దెబ్బకొట్టాలని బీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. అందుకే ఆయన కొడుకు ఇష్యూ బయటకు రాగానే .. బండి సంజయ్‌నే టార్గెట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ కీలక నేతను దెబ్బకొట్టే అవకాశం వస్తే వదిలి పెట్టదు. అందుకే ఇప్పుడు అందరి టార్గెట్ బండి సంజయ్ అయ్యారు. కుమారుడు తప్పు చేస్తే శిక్షిస్తామని చెప్పలేని బండి సంజయ్.. తనపై కుట్ర అని గగ్గోలు పెడుతున్నారు..కానీ ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయింది.
