బండ్ల గణేష్.. ఈ పేరు వినగానే ఒక రకమైన ఎనర్జీ, లౌక్యం,మాటల గారడీ గుర్తొస్తాయి. ఎవరిని ఎలా పొగడాలో, ఎప్పుడు ఎవరి కాళ్ళకు మొక్కాలో .. అలాగే ఎప్పుడు ఎవర్ని సోషల్ మీడియాలో పరోక్షంగా బ్లాక్ మెయిల్ చేయాలో ఆయనకు తెలిసినంతగా బహుశా మరెవరికీ తెలియదేమో. ప్రస్తుతం ఆయన చూపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై పడింది. గతంలో చంద్రబాబు అరెస్టు అయినప్పుడు, ఆయన క్షేమంగా బయటకు వస్తే షాద్ నగర్ నుండి తిరుమల వరకు కాలినడకన వస్తానని గణేష్ మొక్కుకున్నారట. ఇప్పుడు ఆ మొక్కు తీర్చుకోవడానికి మహా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని పీఆర్ ద్వారా గట్టిగానే ప్రచారం చేయించుకుంటున్నారు.
బండ్ల గణేష్ కమెడియన్ మాత్రమే కాదు లౌక్యం తెలిసిన వ్యక్తి. రాజకీయాల్లో ఎటు గాలి వీస్తుందో ముందే పసిగట్టే పొలిటికల్ వెదర్ మ్యాన్. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బ్లేడ్‌తో గొంతు కోసుకుంటా అని చెప్పిన ఆయన ఆవేశం అందరికీ గుర్తుంటుంది. తర్వాత తన కామెడీ అన్నారు. ఇప్పుడు అదే స్థాయిలో చంద్రబాబుపై భక్తిని కురిపిస్తున్నారు. ఎదుటి వ్యక్తికి అవసరం లేకపోయినా, తన భక్తిని అతిగా ప్రదర్శించి పనులు చక్కబెట్టుకోవడంలో ఆయనది ఒక ప్రత్యేకమైన శైలి. ఇదే చంద్రబాబు గతంలో బీజేపీతో పొత్తులు పెట్టుకున్నప్పుడు ఆయన చేసిన ట్వీట్లు చాలా అతిగా ఉండేవి.
చంద్రబాబు అరెస్టు సమయంలో మొక్కుకున్నానని చెబుతూ ఇప్పుడు తిరుమలకు పాదయాత్ర చేయడం వెనుక కేవలం చంద్రబాబుపై అభిమానం మాత్రమే ఉందని ఎవరూ అనుకోరు. ఏపీలో కూటమి ప్రభుత్వం బలంగా ఉండటం, త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ ఉండటం వంటి అంశాలు బండ్లన్నను ఈ దిశగా ప్రేరేపించి ఉండవచ్చు. నిజానికి ఆయనకు చంద్రబాబుపై ఉన్నది అభిమానమా లేక ఏదైనా ఆశించారు అన్నది పక్కన పెడితే టైమింగ్ మాత్రం అదిరిపోయింది. జైలు నుంచి ఎప్పుడో విడుదలయ్యారు, ముఖ్యమంత్రి కూడా అయ్యారు.. కానీ ఇప్పుడు యాత్ర మొదలుపెట్టడం వెనుక లౌక్యం స్పష్టంగా కనిపిస్తోంది.
బండ్ల గణేష్ వ్యక్తిత్వంలో ఒక విచిత్రమైన కోణం ఉంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్‌ను దేవర అని ఆకాశానికి ఎత్తారు, తర్వాత లోకేష్‌ను విమర్శించారు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబును ఆరాధిస్తున్నారు. ఆయన ఎవరిని విమర్శించినా, పొగిడినా అది చూసేవారికి ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అనిపిస్తుంది. ఎదుటివారు ఇబ్బంది పడుతున్నా సరే, తన అతి ప్రశంసలతో వారిని ఉక్కిరిబిక్కిరి చేయడం ఆయన స్టైల్.
రాజకీయాల్లో మనుగడ సాగించాలన్నా..పనులు చేయించుకోవాలన్నా ఇలాంటి కాకా పట్టే విద్యలు అవసరమని గణేష్ నమ్ముతారు. షాద్ నగర్ నుంచి తిరుమల వరకు 500 కిలోమీటర్లు నడవడం అనేది శారీరక శ్రమతో కూడిన పని అయినా, దానివల్ల వచ్చే మైలేజ్ ముందు అది తక్కువే. ఆ విషయం బండ్ల గణేష్‌కే ఎక్కువ తెలుసు.


