చాలా రోజులుగా నాన్చుతూ వచ్చిన బీసీసీఐ ఎట్టకేలకు ఆసియా కప్ కోసం భారత జట్టు అనౌన్స్ చేసింది. ఈ మ్యాచ్‌లు టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్నారు. కెప్టెన్ సూర్యకుమార్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తో కూడిన 15 మంది ఆటగాళ్ల పేర్లు వెల్లడించారు.
సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, హర్షిత్ రానా, బూమ్రా, రింకు సింగ్.. ఇదీ భారత జట్టు.
ఈ జట్టు కూర్పులో కొన్ని సర్ప్రైజ్లు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ లాంటి టీ20 స్పెషలిస్ట్‌ని జట్టులోకి తీసుకోకపోవడం సర్వత్రా చర్చ అయింది.
గంభీర్ కి అయ్యర్ కి మధ్య ఏవో విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాలను పక్కనపెట్టి శ్రేయస్ అయ్యర్‌ని జట్టులోకి తీసుకుంటారనే ఒక అంచనా ఉండింది. కానీ అయ్యర్ కి మొండి చేయే చూపించారు.
ఇక ఏడాది పాటు ఇండియన్ టీ20 ఇంటర్నేషనల్ జట్టుకి దూరంగా ఉన్నా గిల్‌ని తీసుకొచ్చి జట్టులో పెట్టారు. మంచి ఫార్మ్‌లో ఉన్న జైస్వాల్‌ని దూరం పెట్టారు. రియాన్ పరాగ్‌ని ఆడిస్తారేమో అని అంతా భావించారు. అతను కూడా విధ్వంసకర టీ20 ప్లేయర్. తనకి కూడా చోటు దక్కలేదు.
ఇదంతా పక్కన పెడితే అయ్యర్‌ని తీసుకోకపోవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయ్యర్ మామూలు ఆటగాడు కాదు. ఐపీఎల్లో కలకత్తా నైట్ రైడర్స్‌కి టైటిల్ కొట్టిన కెప్టెన్, లేటెస్ట్ సీజన్లో పంజాబ్ టీమ్‌ని ఫైనల్ వరకు తీసుకొచ్చాడు.
సింగిల్ హ్యాండ్‌తో మ్యాచ్‌ని మలుపు తిప్పగల బ్యాట్స్‌మన్ అయ్యర్. అలాంటి అయ్యర్‌ని ఏవో కొన్ని మనస్పర్ధల కారణంగా టీమ్‌లోకి తీసుకోకపోవడంతో ఇప్పుడు అందరి చూపు గంభీర్ పైనే పడింది. గంభీర్ నిర్ణయాలన్నీ ఏకపక్షంగా, నియంతృత్వంతో ఉంటాయని ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఈ జట్టు కూర్పులో అయ్యర్‌ని పక్కన పెట్టేయడం చూస్తే ఆ అభిప్రాయానికి మరింత బలం చేకూర్చినట్లుగా అయింది.