కలియుగ వైకుంఠమైన తిరుమల పవిత్రతను, తిరుపతి ప్రతిష్టను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ, నిరంతరం వివాదాలు సృష్టిస్తున్నారంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డిలపై హిందూ సమాజం, సాధుసంతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలపై ఉద్దేశపూర్వకంగా కట్టుకథలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ అలిపిరి వేదికగా స్వామీజీలు, హిందూ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు.
అధికారం కోల్పోయినప్పటి నుండి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసేలా భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి నిరంతరం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ హిందూ ధార్మిక సంస్థలు, స్వామీజీలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలిపిరి వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ప్రతినిధులు, అర్చక సమాఖ్య నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కోట్ల మంది భక్తుల ఆరాధ్యదైవమైన వేంకటేశ్వరస్వామి జోలికి రావద్దని, ఆధారాల్లేని ఆరోపణలతో తిరుమల పవిత్రతను బజారున పడేసే డ్రామాలకు స్వస్తి పలకాలని వారు హెచ్చరించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో తాము అధికారంలో ఉన్నప్పుడు తిరుమలలో జరిగిన అనేక అపచారాలపై, లడ్డూ కల్తీ వివాదాలపై నోరు మెదపని భూమన.. ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే ప్రతి చిన్న విషయానికి అపవిత్రత రంగు పూయడంపై స్వామీజీలు మండిపడ్డారు. అలిపిరి పరిసరాల్లో ఎప్పుడో దశాబ్దాల క్రితం అసంపూర్తిగా వదిలేసిన శనీశ్వరుడి విగ్రహాన్ని మహావిష్ణువు విగ్రహంగా చిత్రీకరించి భక్తులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం భూమన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి విమర్శించారు. లేని సమస్యలను సృష్టించి భక్తులలో ఆందోళన కలిగించడం ధర్మద్రోహమే అవుతుందని వారు స్పష్టం చేశారు.
భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన అనుచరులు ఇప్పటికైనా ఈ రాజకీయ నాటకాలను ఆపకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని సాధుసంతులు హెచ్చరించారు. స్వామివారి పవిత్రతతో ఆడుకునే ఇలాంటి చీడపురుగులను హిందూ సమాజం ఎప్పటికీ క్షమించదని, తమ వైఖరిని మార్చుకోని పక్షంలో తిరుపతిలోని భూమన నివాసం ఎదుట నిరాహార దీక్షలు చేస్తామని, ఇళ్లను ముట్టడిస్తామని కఠినమైన సంకేతాలు పంపారు. భూమన, ఆయన కుమారుడికి దేవుడిపై నమ్మకం లేదని అందరికీ తెలుసు, అందుకే వారు టీటీడీపై తప్పు చేస్తున్నామన్న భావన లేకుండా దాడులు చేస్తున్నారు.


