రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావు కడిగిన ముత్యంలా బయటకు వచ్చారు. ఆయనపై జగన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన కేసులో దాఖలు చేసిన చార్జిషీట్ ను హైకోర్టు కొట్టి వేసింది. నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారని ఏబీవీపై ప్రభు్తవం కేసు పెట్టింది. తర్వాత ఏసీబీ కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. అసలు పరికరాలేవీ కొనకుండానే.. తన ప్రమేయం ఎక్కడా లేకుండా కనీస సాక్ష్యాలు లేకుండా కేసులు పెట్టారని చార్జిషీటు కొట్టివేయాలని ఏబీవీ కోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టులో దాఖలైన ఛార్జ్ షీట్‌ను ఏపీ హైకోర్టు కొట్టి వేసింది. ఇప్పటికే విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణను నిలిపేసిన హైకోర్టు తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.
తనపై తప్పుడు కేసులు పెట్టారని హైకోర్టు తేల్చడంతో ఏబీ వెంకటేశ్వరరావు సంతృప్తి వ్యక్తం చేశారు. నాకు అండగా నిలి నైతిక మద్దతు ఇచ్చిన అందరికీ వేవేల కృతజ్ఞతలు అని ఏబీవీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. టీడీపీ హయాంలో ఇంటిలిజెన్స్ చీఫ్ గా పని చేసిన ఆయనపై జగన్ ద్వేషం పెంచుకున్నారు. అధికారంలోకి రాగానే ముందుగా పోస్టింగ్ లేకుండా చేసి తర్వాత సస్పెండ్ చేశారు . ఇందు కోసం తప్పుడు కేసులు పెట్టారు. ఐదేళ్ల పాటు ఆయన సర్వీస్ నష్టం అయింది. హైకోర్టు ఆదేశాలతో రిటైర్మెంట్ రోజు మాత్రమే పోస్టింగ్ ఇచ్చారు. ఆ రోజునే ఆయన రిటైర్ అయ్యారు.
ఇప్పుడు ఆయన కడిగిన ముత్యం అని తేలినా.. ఆయన సర్వీసులో కోల్పోయిన ఐదేళ్ల నష్టాన్ని మాత్రం ఎవరూ భర్తీ చేయలేరు. ప్రస్తుతం ప్రభుత్వం జీతభత్యాలన్నీ ఇవ్వాలని నిర్ణయించిది. కానీ ఐపీఎస్ అధికారికి జీతభత్యాల కన్నా..ఐదేళ్ల పాటు పోస్టింగ్ లేకుండా తనపై పడిన మచ్చ, ఇమేజ్ నష్టమే కీలకం. అందుకే ఆయన సంతోషంగా ఉన్నారని అనుకోలేం కానీ.. తప్పుడు కేసుల నుంచి బయటపడినందుకు హ్యాపీ ఫీలై ఉంటారు.