మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్.. అమరావతిలో పర్యటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు టెక్నాలజీని ఉపయోగించి అందిస్తున్న సేవలను చూసి ప్రశంసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తో కలిసి సచివాలయ మొదటి బ్లాక్‌లోని ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించారు. డేటా లేక్, వాట్సాప్ గవర్నెన్స్, , అవేర్ 2.0 వంటి వినూత్న పద్ధతుల ద్వారా పౌర సేవలను వేగవంతం చేస్తున్న తీరును చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బ్లాక్ చెయిన్ టెక్నాలజీని ఉపయోగించి భూ రికార్డులను భద్రపరచడం, క్యూఆర్ కోడ్ విధానం ద్వారా పారదర్శకత తీసుకురావడం వంటి అంశాలను ఆయన గ్రేట్ వర్క్ అని కొనియాడారు. రాష్ట్రంలో పన్ను వసూళ్ల ప్రక్రియలో సాగుతున్న డిజిటల్ సంస్కరణలను సైతం ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.
సియోల్ నుంచి నేరుగా గన్నవరం వచ్చిన ఆయనకు నారా లోకేష్ తో పాటు సీనియర్ నేతలు స్వాగతం పలికారు. తర్వాత సచివాలయంకు వెళ్లారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరు జిల్లా కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న సంజీవని హెల్త్ ప్రాజెక్టు ఫలితాలను అధికారులు వివరించారు. డిజిటల్ హెల్త్ రికార్డుల నిర్వహణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం ద్వారా ప్రజారోగ్య సేవలను మెరుగుపరుస్తున్న తీరును గమనించిన గేట్స్, దట్స్ నైస్ అంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీలో ఏఐ వినియోగంతో హెల్త్ ప్రొఫైలింగ్ చేయడం బాగుందని, దీనిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సూచించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విజన్ 2047 పై బిల్ గేట్స్‌కు సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యాలు, ప్రభుత్వ పాలసీలను వివరించారు. రాజధాని అమరావతిలో 30 శాతం గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళికను బిల్ గేట్స్ ఆసక్తిగా తిలకించి బాగుందని వ్యాఖ్యానించారు. భారత డిజిటల్ విప్లవంలో ప్రధాని మోదీతో పాటు చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అమరావతి పర్యటన ముగించుకుని బిల్ గేట్స్ బృందం ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి, అక్కడ డ్రోన్లు , ఏఐ సాంకేతికతను సాగులో ఎలా ఉపయోగిస్తున్నారో ప్రత్యక్షంగా పరిశీలించారు. ఏపీ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య కుదిరిన ఈ సహకారం భవిష్యత్తులో ఆరోగ్యం, విద్య, వ్యవసాయ రంగాల్లో మరిన్ని విప్లవాత్మక మార్పులకు బాటలు వేయనుంది. మధ్యాహ్నం పర్యటన ముగించుకుని గేట్స్ బృందం ముంబై వెళ్లింది.