విజయవాడలో లెనిన్ సెంటర్ పేరు మార్చాలని ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చేసిన ప్రకటనను చూసి సాధారణ ప్రజలు ఇక వీరు ఎప్పటికీ మారరన్న కామెంట్లు వినిపిస్తున్నారు. యువనాయకుడు అయిన మాధవ్ .. కాస్త ప్రజా కోణంలో రాజకీయాలు చేస్తారని అనుకున్నారు. బీజేపీ మార్క్ హిందూయిజం వాదనను బలంగా వినిపిస్తే అది వారి పార్టీ విధానమనుకుంటారు. కానీ ఇలా ప్రజల్లో పాతుకుపోయిన పేర్లను మార్చేయాలంటూ.. అడ్డగోలు డిమాండ్లు వినిపిస్తున్నారు.
విజయవాడలో లెనిన్ సెంటర్ లో లెనిన్ విగ్రహం పెట్టి 40 ఏళ్లకుపైగా అవుతోంది. ప్రత్యేకంగా ఆ సెంటర్ కు ఎవరూ లెనిన్ సెంటర్ అని పేరు పెట్టలేదు. అక్కడ లెనిన్ విగ్రహం ఉంది కాబట్టి ప్రజలు అలా పిలవడం ప్రారంభించారు. ఆ లెనిన్ ఎవరు అనే దానిపై ఇప్పటి తరానికి పెద్దగా తెలియదు. ఇంటలెక్చువల్స్ , కమ్యూనిజంపై ఆసక్తి ఉండి.. ప్రత్యేకంగా తెలుసుకున్న వారికే తెలుస్తుంది. ఇప్పుడు ఆ పేరును వివాదం చేయాల్సిన అవసరమే లేదు. దాని వల్ల కమ్యూనిస్టులు మరింతగా బీజేపీపై విమర్శలు చేసి ప్రచారంలోకి రావడానికి ..లెనిన్ గురించి ఇప్పటి వాళ్లకు తెలియచేసే ప్రయత్నం చేసుకుంటారు. నిర్వీర్యమైపోతున్న కమ్యూనిస్టులకు మేలు చేసినట్లుగా ఈ వివాదం సృష్టించినట్లు అవుతుంది.
బీజేపీ నేతలు గుంటూరులో జిన్నాటవర్ సెంటర్ మీద కూడా ఇలాగే మాట్లాడారు. అసలు జిన్నాటవర్ పాకిస్తాన్ జాతిపిత పేరు మీద పెట్దటారని ఎవరికీ తెలియదు. ఎవరూ అనుకోరు కూడా. కానీ గుంటూరులో ఉండే వారికి ఆ సెంటర్ తో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ఆ ఏరియాపై వివాదం చేస్తే ప్రజలందరికీ కోపం వస్తుంది. లెనిన్ సెంటర్ విషయంలోనూ అంతే. ప్రజల ఎమోషన్స్ లో ఆ ప్రాంతాలు భాగంగా ఉంటాయి. వాటి జోలికి వెళ్లడం వల్ల.. ఎలాంటి ఉపయోగం ఉండదు. ఆ పేర్లకు మతాలు, భావజాలాలు అంటగట్టి మార్చాలని డిమాండ్ చేస్తే ప్రజల మద్దతు రావడం సాధ్యం కాదు పైగా నెగెటివిటీ వస్తుంది. లెనిన్ సెంటర్ పేరు మార్చాలని మాధవ్ అన్న తర్వాత.. ఎక్కువగా వినిపించిన డిమాండ్… ముందు అహ్మదాబాద్ పేరు మార్చాలని. ఎందుకు మార్చడం లేదు ?