పంజాబ్, హర్యానాలా ఉమ్మడి రాజధానిగా ఉన్న చండీగఢ్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం పంజాబ్‌లో రాజకీయ మంటలకు కారణం అయింది. ఉమ్మడి రాజధానిగా ఉన్న చండిగఢ్ను పూర్తి స్థాయి కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు బిల్లు పెట్టాలనుకున్నారు. కానీ రాజకీయ పార్టీలన్నీ ఒక్క సారిగా తిరగబడటంతో ఇప్పుడా ఆలోచన లేదని వెనక్కి తగ్గారు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చండీగఢ్ కేంద్రంగా సెంటిమెంట్ రాజకీయాలు ప్రారంభమయ్యాయి.
ఉమ్మడి రాజధాని అయినా పంజాబ్ గవర్నర్ పాలన !
1966లో పంజాబ్, హర్యనాలను ఏర్పాటు చేసినప్పుడు చండీగఢ్‌ను యూనియన్ టెరిటరీగా చేసి ఉమ్మడి రాజధాని చేశారు. ఈ టెరిటరీని ప్రస్తుతం పంజాబ్ గవర్నర్ పాలిస్తున్నారు. ఇది 1984 జూన్ 1 నుంచి అమలులో ఉంది. దీనికి ముందు, చండీగఢ్‌కు స్వతంత్ర చీఫ్ సెక్రటరీ అడ్మినిస్ట్రేటర్‌గా ఉండేవారు. 2016లో కేంద్రం మాజీ IAS అధికారి కెజే అల్ఫాన్స్ను స్వతంత్ర అడ్మినిస్ట్రేటర్‌గా నియమించే ప్రయత్నం చేసింది. కానీ పంజాబ్ పార్టీల వ్యతిరేకత కారణంగా వాపోయింది. పంజాబ్ రాజకీయ నాయకులు, పార్టీలు చండీగఢ్‌ను పంజాబ్‌కు చెందిన రాజధానిగానే భావిస్తున్నారు.
పూర్తి స్థాయి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే ఆలోచన
కేంద్రం చండీగఢ్‌ను రాజ్యాంగంలోని ఆర్టికల్ 240 కిందకు తీసుకురావాలని ప్రతిపాదించింది. ఇది అధ్యక్షుడు ద్వారా పాలించే యూనియన్ టెరిటరీలకు సంబంధించినది. ఇది కేంద్ర చట్టాలను సులభంగా అమలు చేయడానికి సహాయపడుతుంది. ఇలా చేస్తే అండమాన్ & నికోబార్, లక్షద్వీప్, దాద్రా & నాగర్ హవేలీ, డయ్యూడామన్ వంటి ఇతర యూటీలతో సమానంగా ఉంటుంది. పుదుచ్చేరికి కూడా అసెంబ్లీ లేనప్పుడు వర్తిస్తుంది. కేంద్ర ప్రతిపాదపై పంజాబ్‌లోని అన్ని పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ ప్రతిపాదనను కేంద్రం తాత్కాలికంగా విరమించినట్లు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఈ వివాదం పంజాబ్-హర్యానాల మధ్య దీర్ఘకాలిక ఉద్రిక్తతలను మరింత ఊపందుకునేలా చేసింది.
అన్ని పార్టీలకూ బీజేపీ టార్గెట్ – బీజేపీ నేతలూ ఖండించారు !
అన్ని పార్టీలు కేంద్రం పంజాబ్ హక్కులపై దాడి చేస్తోందని మండిపడ్డాయి. పంజాబ్ ముఖ్యమంత్రి భగ్వంత్ మాన్ దీన్ని “తీవ్ర అన్యాయం”గా అభివర్ణించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ “పంజాబ్ రాజధానిని దోచుకోవడానికి కుట్ర పన్నుతోంది” అని ఆరోపించారు. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ “తీవ్ర పరిణామాలు” ఉంటాయని హెచ్చరించారు. పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ కూడా వ్యతిరేకించారు . “చండీగఢ్ పంజాబ్‌కు అంతర్భాగమే” అని ప్రకటించారు. ఇలా తీవ్ర వ్యతిరేకత రావడంతో బిల్లుపై వెనక్కి తగ్గారు. కానీ మంట మాత్రం అంటుకుంది.