దేశ రాజకీయాల్లో వన్ సైడ్ బ్యాటింగ్ జరిగిన మరో ఏడాది 2025. బీజేపీ దూకుడును కాంగ్రెస్ పార్టీ ఏ దశలోనూ అడ్డుకోలేకపోయింది. బీహార్ లో అధికార వ్యతిరేకత కాకుండా ప్రతిపక్ష వ్యతిరేకత కనిపించింది. ఓట్ల చోరీ పేరుతో ప్రజల్ని నమ్మించలేని రాజకీయం చేస్తున్న రాహుల్ గాంధీ ఓ వైపు.. ప్రధానిగా తన పనితీరుతో ప్రజల్ని మెప్పిస్తున్న మోదీ మరో వైపు ఉన్నారు. అందుకే రాహుల్ తేలిపోతున్నారు. ఫలితంగా జాతీయ రాజకీయాల్లో బీజేపీ,మోదీనే బాహుబలిగా నిలబడ్డారు. రాహుల్ గాంధీ ఎదిగే ప్రయత్నం చేయడం లేదు. అందుకే 2026 ఎలా ఉంటుదో చెప్పాల్సిన పనిలేదు.
బీజేపీకి పూర్తి మెజార్టీ లేదు అన్న భావనే లేదు !
2024లో సొంతంగా మెజారిటీ సాధించలేకపోయిన బీజేపీ ఇతర పార్టీల మీద ఆధారపడి ఉందని అనుకోవడం లేదు. 300 సీట్లు వచ్చినప్పుడు ఎంత ధీమాగా పరిపాలన చేస్తుందో ఇప్పుడూ అంతే చేస్తున్నారు. మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూల మద్దతుతో పాలన సాగిస్తున్న కమల దళం, తన మౌలిక సిద్ధాంతాలైన ‘ఒక దేశం – ఒక ఎన్నిక’ వంటి అంశాలపై దూకుడుగానే వ్యవహరిస్తోంది. ప్రధాని మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్టను పెంచుతూ ప్రజల మద్దతు పెంచుకుంటున్నారు. ఈ ఏడాది బీహార్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. వచ్చే ఏడాది దక్షిణాదిలో కూడా జెండా పాతాలని అనుకుంటున్నారు. బెంగాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
రాహుల్ కు బదులు తెరపైకి ప్రియాంక పేరు
రాహుల్ గాంధీ లోక్సభ ప్రతిపక్ష నేత గా బాధ్యతలు చేపట్టినా బీజేపీకి గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. ఓట్ల చోరీ, సామాజిక న్యాయం, కులగణన అంటూ ఆయన చేసిన రాజకీయాలు ఫలితాలు ఇవ్వలేదు.ఇంకా నష్టం చేశాయి. రాహుల్ గాంధీ రాజకీయం వల్ల కాంగ్రెస్ కు లాభం జరగడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో మెల్లగా ప్రియాంకా గాంధీ పేరు తెరపైకి వస్తోంది. రాహుల్ గాంధీ ప్రజలతో టచ్ ఉండే రాజకీయాలు చేయడం లేదు. కులగణన పేరుతో ఆయన చేస్తున్న రాజకీయం బీజేపీని బలోపేతం చేస్తోంది. వ్యవస్థలను దెబ్బతీసేలా.. దేశానికి వ్యతిరేకంగా ఆయన రాజకీయాలు చేస్తున్నారన్న భావన ప్రజల్లో ఏర్పడుతోంది. ఆయన మోదీకి ప్రత్యామ్నాయం అని ప్రజలు నమ్మడం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగుపడటం లేదు.
మిగతా పార్టీలన్నీ సవాళ్లకు ఎదురెళ్లాల్సిన పరిస్థితి
ఆమ్ ఆద్మీ పార్టీ అసలు ఈ ఏడాది సందడే చేయలేదు. కేజ్రీవాల్ అసలు పెద్దగా బయట కనిపించడం లేదు. మమతా బెనర్జీ బెంగాల్ దాటి జాతీయ స్థాయిలో తన గళం వినిపించేందుకు సాహసించ లేకపోతున్నారు. ముందుగా ఆమె నాలుగోసారి తన పదవిని బెంగాల్ లో కాపాడుకోవడం అత్యవసరం. వామపక్షాలు తమ ఉనికిని కాపాడుకోవడానికి కేరళపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. కానీ స్థానిక ఎన్నికల్లో కేరళలో కూడా పట్టు కోల్పోయారు. మాయావతి నాయకత్వంలోని బీఎస్పీ తన ప్రాభవాన్ని క్రమంగా కోల్పోతోంది. దళిత ఓటు బ్యాంకు కాంగ్రెస్ , బీజేపీల వైపు వైళ్తోంది. ఆ పార్టీకి ఫ్యూచర్ ఉందని ఎవరూ అనుకోవడం లేదు.
మొత్తంగా బీజేపీకి ఎదురు వెళ్లడానికి ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా లేవు. జాతీయ పార్టీలకు బలం సరిపోవడం లేదు. 2026లోనూ మార్పులు వస్తాయని ఎవరూ అనుకోలేకపోతున్నారు.
