ఒక హీరోకి సంబంధించి, ఒకే రోజు రెండు సినిమాలు విడుదల అవ్వడం అరుదైన ఫీట్. గతంలో నందమూరి బాలకృష్ణ నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అయ్యాయి. ఆ తరవాత నానికి ఈ ఘనత దక్కింది. అయితే ఓరకంగా ఇదో తలనొప్పి. రెండు సినిమాలు విడుదలైతే, కలక్షన్లు పంచుకోవాలి. ఓ సినిమా ప్రభావం మరో సినిమాపై తప్పకుండా ఉంటుంది. ఒక్కోసారి రెండు సినిమాలూ అది మైనస్ గా మారే అవకాశం ఉంది. శ్రీవిష్ణు విషయంలోనూ ఇదే సీన్ రిపీట్ అవ్వాల్సింది.
ఆయన నటించిన ‘మృత్యుంజయ్’, ‘విష్ణు విన్యాసం’ సినిమాలు రెండూ ఒక రోజు వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు వస్తాయని ప్రకటించారు. రెండు సినిమాలకు సంబంధించిన నిర్మాతలకు ఒకే రోజు రెండు సినిమాల్ని విడుదల చేయడం ఇష్టం లేదు. కాకపోతే ఓటీటీ ప్రెజర్ తో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. శ్రీవిష్ణు కూడా ‘ఈ విషయంలో నా ప్రమేయం ఏం లేదు’ అంటూ చేతులు ఎత్తేశాడు. రెండు సినిమాలూ ఓకేసారి వస్తాయని ఆడియన్స్ కూడా ఫిక్సయిపోయారు. ఇప్పుడు ఈ రెండు సినిమాల్లో ఒకటి వెనక్కి తగ్గుతోంది. ‘మృత్యుంజయ్’ ఓ వారం ఆలస్యంగా విడుదల అవుతుందని సమాచారం. అంటే.. ఫిబ్రవరి 28న శ్రీవిష్ణు నుంచి ఒక్క సినిమానే రాబోతోంది. ఇది నిజంగా శ్రీవిష్ణుకీ, ఆయన నిర్మాతలకూ కొండంత రిలీఫ్. రెండు సినిమాలకూ ఓవారం గ్యాప్ ఉండడం వల్ల.. రెండు సినిమాలకూ ప్లస్ అవుతుంది. ‘విష్ణు విన్యాసం’ సినిమాకు మంచి టాక్ వచ్చి, నిలబడితే.. అది ‘మృత్యుంజయ్’ సినిమాకు మరింత కలిసొస్తుంది. ‘మృత్యుంజయ్’ వాయిదా పడిందన్న విషయాన్ని ఈరోజు గానీ రేపు గానీ చిత్రబృందం అధికారికంగా ప్రకటిస్తుంది.
