కరూర్ తొక్కిసలాట ఘటనతో తనను రాజకీయంగా టార్గెట్ చేస్తారని ఆందోళన చెందుతున్నారు టీవీకే అధ్యక్షుడు విజయ్. ఇలాంటి సంక్షోభాలను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఆయనతో పాటు ఆయన టీం తప్పటడుగులు వేస్తోంది. ఘటన జరిగిన వెంటనే పట్టించుకోకపోవడం.. బాధితుల్ని ఆదుకునే ప్రయత్నం చేయకపోవడం వివాదాస్పదమయింది. ప్రత్యేకంగా విచారణ కమిటీని ప్రభుత్వం నియమించడంతో వెంటనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పోలీసులు లాఠీచార్జి చేయడం వల్లనే తొక్కిసలాట జరిగిందని.. తన సభలో అలజడికి కుట్ర చేశారని అందుకే విచారణను సీబీఐకి లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు ఇవ్వాలని విజయ్ పిటిషన్ లో కోరారు. నిజానికి ఇది చాలా ప్రమాదకకరమైన ప్రయత్నమని తమిళనాడు రాజకీయవర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి ఏ చర్యలు తీసుకున్నా అది కక్ష సాధింపుగానే ప్రచారం జరుగుతుంది. అది విజయ్ కు ప్లస్ అవుతుంది. కానీ సీబీఐ లేదా ఇతర స్వతంత్ర దర్యాప్తు అయితే బీజేపీ చేతుల్లోకి వెళ్తుంది. అప్పుడు విజయ్ ఇంకా చిక్కుల్లో పడతారు.
విజయ్ ను ఈ కేసులో ఎలా లొంగదీసుకోవాలో బీజేపీ అలాగే ప్రయత్నిస్తుంది. నిజానికి సీబీఐ చెప్పేది విజయ్ ను ఇబ్బంది పెట్టేలా ఉంటే రాజకీయంగా నష్టం జరుగుతుంది. బాధితుల్ని ఆదుకునే విషయంలో ఆలస్యంగా స్పందించిన విజయ్.. ఈ ఘటనను రాజకీయంగా ఎదుర్కోవడంలోనూ వ్యూహాత్మకంగా ఆలోచించలేకపోతున్నారు. ఆయనతో డీఎంకే ఓ ఆట ఆడుకునే అవకాశం కనిపిస్తోంది.