భారతీయ జనతా పార్టీని బీఆర్ఎస్ విమర్శించడం లేదు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కొంత మంది నేతలు మాత్రమే విమర్శిస్తున్నారు. బండి సంజయ్ లాంటి వారు మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. రెండు పార్టీల మధ్య కనిపించని అండర్ స్టాండింగ్ ఉందని.. కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల్లోనూ అదే వర్కవుట్ అయిందని రేవంత్ రెడ్డి కూడా చెబుతున్నారు. రెండు పార్టీలను కలిపే రేవంత్ ఫలితాలు చెబుతున్నారు. మరో వైపు చాలా గ్రామాల్లో బీఆర్ఎస్ కు అత్యల్ప ఓట్లు.. బీజేపీకి అత్యధిక ఓట్లు వచ్చాయి. ఇదంతా అవగాహనతోనే సాగిందని కాంగ్రెస్ ఓ నిర్ణయానికి వచ్చింది. మరి నిజంగానే ఆ రెండు పార్టీలు అవగాహనకు వచ్చాయా..లేదా అన్నది మాత్రం క్లారిటీ లేదు. నిజంగా క్షేత్ర స్థాయిలో అయినా అలా అవగాహనతో పోటీ చేసి ఉంటే మాత్రం రెండు పార్టీలు కలసి పోటీ చేయడానికి ఓ దారి ఏర్పడినట్లే అనుకోవచ్చు.
చాలా చోట్ల కాంగ్రెస్ ను అడ్డుకునేందుకు సహకరించుకున్న బీజేపీ, బీఆర్ఎస్
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ను నిలువరించేందుకు బీఆర్ఎస్, బీజేపీలు చేతులు కలిపాయని క్షేత్ర స్థాయి నుంచి వస్తున్న ప్రచారం నిరూపిస్తోంది. గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ హవాను అడ్డుకోవడమే లక్ష్యంగా, ఎక్కడైతే ఏ పార్టీ బలంగా ఉందో అక్కడ ఆ పార్టీకి సహకరించుకునేలా అంతర్గత వ్యూహాలు అమలు చేసినట్లు అన్ని పార్టీలూ ఓ క్లారిటీకి వచ్చాయి. దీనివల్ల రెండు పార్టీలకు రాజకీయంగా మేలు జరిగిందని అంటున్నాయి. ఉత్తర తెలంగాణలో బీజేపీ.. దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించాయని.. మరీ వెనుకబడిపోకుండా..గట్టిగా నిలబడ్డామన్న సంకేతాలు వచ్చాయని అంటున్నారు.
కూటమిగా పని చేశాయని చెబుతున్న సీఎం రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగాల్లో బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఉన్న అవిభక్త బంధాన్ని పదే పదే ఎండగడుతున్నారు. బయట తిట్టుకుంటూ.. లోపల ఒక్కటవుతున్నారు అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చీలకుండా చూడటమే ఈ రెండు పార్టీల వ్యూహమని ఆయన ఆరోపించారు. అయితే రేవంత్ అనుమానాలు నిజం కావడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బీజేపీని బీఆర్ఎస్ విమర్శించడం లేదు. పైగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. తరచూ రాహుల్ గాంధీని కేటీఆర్ విమర్శిస్తూంటారు. ఆయన రాజకీయంగా ఫెయిల్ అయ్యారని అంటున్నారు.
రెండు పార్టీలు కలిస్తే రాజకీయంగా లాభమే
బీఆర్ఎస్ , బీజేపీలు కలిసి పనిచేయడం వల్ల రెండు పార్టీలకూ ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. అధికార పార్టీకి ఏకపక్షంగా విజయాలు దక్కకుండా, విపక్ష ఓటు బ్యాంకును ఏకీకృతం చేయడం ద్వారా కాంగ్రెస్ జోరుకు అడ్డుకట్ట వేయవచ్చు. కొన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు బీజేపీ అభ్యర్థులకు, మరికొన్ని చోట్ల బీజేపీ మద్దతుదారులు బీఆర్ఎస్ అభ్యర్థులకు సహకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. అయితే, బహిరంగంగా పొత్తు పెట్టుకుంటే జాతీయ స్థాయిలో బీజేపీకి, రాష్ట్ర స్థాయిలో బీఆర్ఎస్కు ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే ఈ అంతర్గత’ వ్యూహాన్ని అమలు చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పరిషత్, మున్సిపల్ ఎన్నికల నాటికి ఈ అవగాహనను మరింత విస్తరించుకుంటే.. తర్వాత ఎన్నికల నాటికి కూటమిగా కాంగ్రెస్ ను ఢీకొట్టే అవకాశం ఉంది.
