జూబ్లిహిల్స్ పోలింగ్ జరుగుతున్నప్పుడే బీఆర్ఎస్ పార్టీ జావకారిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుండి అదే పనిగా కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తూ వచ్చిన నేతలు.. మధ్యాహ్నానికి నైతికంగా కాంగ్రెస్ ఓడిపోయిందని ప్రకటించేశారు. అంటే నైతిక గెలుపు మాదేనని .. అసలు గెలుపు కాంగ్రెస్ దేనని అంగీకరించినట్లయింది. కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారంగా ఓటర్లను ప్రలోభపెట్టారని.. నాన్ లోకల్స్ తో జూబ్లిహిల్స్ నిండిపోయిందని బీఆర్ఎస్ నేతలు గగ్గోలు పెడుతున్నారు.
అయితే పోలింగ్ ట్రెండ్ కాంగ్రెస్ వైపు స్పష్టంగా ఉండటంతోనే బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి ఆరోపణలు చేస్తోందన్న అభిప్రాయం సహజంగానే పోల్ నిపుణులకు వస్తుంది. ఎందుకంటే ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి పడుతున్నాయని అనుకుంటే వారు చేసే హడావుడి వేరుగా ఉండేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఏదో అక్రమాలకు పాల్పడుతోందని చెప్పడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. చాలా పోలింగ్ బూతుల్లో కాంగ్రెస్ పార్టీకి ఏకపక్ష పోలింగ్ పడుతున్నాయన్న ప్రచారం చాలా ఎక్కువగా జరిగింది.
బస్తీల్లో నవీన్ యాదవ్ కు ఉన్న పట్టు .. వారి పోల్ మేనేజ్ మెంట్ మంచి ఫలితాన్ని ఇచ్చిందని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఎన్ని సమస్యలు ఉన్నా తమకు కేటాయించిన డివిజన్లు ఏరియాల విషయంలో కాంగ్రెస్ నేతలు తమ రాజకీయం చేశారు. ఎవరూ నిర్లక్ష్యం చేయలేదని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వైపే పోలింగ్ సరళి ఉందన్న ప్రచారం రావడంతో.. సైలెంట్ ఓటింగ్ తమకే అని.. బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఏది నిజమో కౌంటింగ్ రోజు స్పష్టమవుతుంది కానీ..బీఆర్ఎస్కు కాన్ఫిడెన్స్ పెద్దగా లేదని వారి తీరుతోనే స్పష్టమవుతోంది.


