తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత తన తండ్రికి రాసిన లేఖ అనూహ్య రాజకీయ పరిణామాలకు కారణం అవుతోంది. కవిత ఈ లేఖను నెల మొదట్లో రాశారు. ఆమె రాసినట్లుగా అప్పట్లోనే సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ తాజాగా ఆ లేఖ లీక్ అయింది. ఈ సమయంలో ఆమె అమెరికాలో ఉన్నారు. ఎప్పుడైనా ఇండియాలో ల్యాండ్ అవ్వొచ్చు.
ఈ లేఖ బీఆర్ఎస్ కు పెద్ద సమస్యగా మారుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో బీార్ఎస్ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. కేసీఆర్ ఎలాగూ ఇలాంటి వాటిపై స్పందించరు. హరీష్ రావు, కేటీఆర్ కూడా స్పందించడానికి నిరాకరిస్తున్నారు. వీరిద్దరూ వేర్వేరు కార్యక్రమాల్లో మీడియా కంటబడినా … స్పందించేందుకు నిరాకరించారు. కవిత అమెరికా నుంచి వచ్చిన తర్వాత పార్టీకి డ్యామేజ్ లేకుండా కవరింగ్ ప్రకటన ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.
మరో వైపు ఇదే అంశంపై కాంగ్రెస్, బీజేపీ మాత్రం వాదులాడుకుంటున్నాయి. కాంగ్రెస్ వదిలిన బాణం అని బీజేపీ ఆరోపిస్తోంది. రఘునందన్ రావు, బండి సంజయ్ సహా అందరూ ఇదే చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కవిత పీసీసీ చీఫ్ అవుతుందని రఘునందన్ రావు అంటే.. కాంగ్రెస్ వదిలిన బాణం అని బండి సంజయ్ విమర్శించారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా.. బీజేపీ, బీఆర్ఎస్ కలసి పని చేస్తున్నాయని తాము మొదటి నుంచి చెబుతున్నామని ఇప్పుడు కవిత లేఖతో అదే నిజయమిందని చెప్పుకొచ్చారు.
ఈ విషయంలో అసలు ఇబ్బంది బీఆర్ఎస్ కు అయితే.. కవిత వెనుక ఉన్నది మీరంటే మీరని రెండు జాతీయ పార్టీలు పరోక్షంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ విషయంలో అసలు రాజకీయం కవిత వచ్చిన తర్వాతనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.