“బుగ్గన” పదవి పోగొట్టుకునేంత తప్పు చేశారా..?

ఢిల్లీలో బీజేపీ, వైసీపీ నేతల మధ్య జరిగినట్లు చెబుతున్న సమావేశం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పదవులకు ఎసరు తెచ్చే పరిస్థితి ఏర్పడిందా..? బుగ్గన రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారా..? ఇంత వరకూ ఎవరూ చేయని తప్పును చేశారా..? అవుననే అంటున్నారు… ఏపీ అర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. స్పీకర్‌గా పని చేసిన యనమల సభావ్యవహారాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న నేత. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. బీజేపీ అగ్రనేతలను కలిసి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అవినీతికి సంబంధించిన ఆధారాలంటూ.. పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి .. అధికారులు అందించిన పత్రాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

శాసనసభా కమిటీలన్నీ రాజ్యాంగబద్దమైనవి. వాటికి సంబంధించిన పత్రాలన్నీ రహస్యమైనవి. కానీ పీఏసీ చైర్మన్ గా తనకు ఉన్న అధికారాలతో ఆ పత్రాలను తీసుకెళ్లి.. బీజేపీ అగ్రనేతలకు బుగ్గన అందించారనేది యనమల రామకృష్ణుడు లేవనెత్తిన పాయింట్. ఇది చాలా తీవ్రమైన విషయంగా యనమల చెబుతున్నారు. ప్రివిలేజ్ నోటీసులు ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించారు. ప్రస్తుతానికి బీజేపీ నేతలకు పత్రాలు అందించినట్లు అధికారికంగా ఎలాంటి రుజువులు బయటకు రాలేదు. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో కలిసి ఢిల్లీలో ఉన్న సీసీ కెమెరా దృశ్యాలు బయటకు వచ్చాయి. అయితే బుగ్గన దీన్ని ఖండించారు. తాను బీజేపీ నేతలను కలవలేదంటున్నారు.

కానీ అసలు ఢిల్లీ రాజకీయవర్గాలు మాత్రం సమావేశాన్ని నిర్ధారిస్తు్ననాయి. రామ్‌మాధవ్ సహా పలువురు ఏపీ బీజేపీ ముఖ్యనేతలను… బుగ్గన కలిశారు. బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి కొంత మంది ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు కూడా హాజరయ్యారు. వీరందరి టార్గెట్ ముఖ్యమంత్రి చంద్రబాబును అవినీతి కేసుల్లో ఇరికించడంపై చర్చ జరిగనట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. ఒక వేళ.. పీఏసీ పత్రాలు.. ఎవరికీ ఇవ్వకపోతే.. బుగ్గనకు పోయేదేమీ లేదు. కానీ రేపు ఆ పత్రాలు బయటకు వస్తే… అంతా బుగ్గన పనేనన్న ప్రచారం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే… బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. ఏపీ అసెంబ్లీ హీట్‌ను చవి చూడాల్సి వస్తుంది.

సభా వ్యవహారాలలో పండిపోయిన యనమల… బుగ్గనపై చేసిన వ్యాఖ్యలతో.. వైసీపీని ఓ రకంగా ఆత్మరక్షణ ధోరణలోకి పడేసినట్లే కనిపిస్తోంది. ఈ విషయాన్ని ఖండించడానికి కూడా బుగ్గన తీవ్రంగా కష్టపడాల్సి రావొచ్చు. పీఏసీ నుంచి బయటకు వెళ్లాయని భావిస్తున్న పత్రాల్లో ఒక్కటి బయటకు వచ్చినా…అది… బుగ్గన పదవికే ఎసరు తీసుకొచ్చే ప్రమాదం కూడా ఉంది. మామూలుగా పదవి పోతే… ఎవరికీ ఏ ఇబ్బందీ ఉండదు. కానీ రహస్య పత్రాలు బయటకు పంపంచి ..పీఏసీకే మచ్చ తెచ్చిన వ్యక్తిగా బుగ్గన మిగిలిపోతారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com