సొంత ఇల్లు అనేది ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఒక జీవితకాల స్వప్నం. కానీ, మారుతున్న ఆర్థిక సమీకరణాలు, నగరాల వేగవంతమైన విస్తరణ నడుమ ఆ కల క్రమంగా సామాన్యుడికి అందుబాటులో లేని లగ్జరీగా మారిపోతోంది. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో రూ. 45 లక్షల లోపు లభించే సరసమైన ధరల గృహాల భాగానికి ప్రస్తుతం తీవ్ర సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒకప్పుడు రియాల్టీ మార్కెట్లో అత్యధిక వాటా కలిగిన ఈ విభాగం, ఇప్పుడు రోజురోజుకూ పడిపోతోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ సంక్షోభానికి ప్రధాన కారణం భూముల ధరలు రికార్డు స్థాయిలో పెరగడమే. ముఖ్యంగా హైదరాబాద్ ఐటీ కారిడార్ చుట్టుపక్కల మాత్రమే కాకుండా, ఔటర్ రింగ్ రోడ్ ( అవతల కూడా గజం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి. దీనికి తోడు అంతర్జాతీయ ఉద్రిక్తతలతో ముడి చమురు ధరలు పెరగడం, తద్వారా సిమెంట్, స్టీల్, ఇటుకలు రవాణా ఖర్చులు భారంగా మారాయి. పెరిగిన పెట్టుబడి వ్యయంతో పోలిస్తే రూ. 45 లక్షల లోపు ఫ్లాట్లను నిర్మించి అమ్మడం ప్రాక్టికల్‌గా సాధ్యం కావడం లేదని, అందుకే బిల్డర్లు ఈ విభాగంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఆసక్తి చూపడం లేదని రియాల్టీ వర్గాలు అంటున్నాయి.
లాభాల మార్జిన్ తక్కువగా ఉండటంతో బిల్డర్లు అందరూ తమ వ్యూహాన్ని మార్చేశారు. తక్కువ ధరల ఇళ్లను పక్కనబెట్టి, ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే లగ్జరీ, ప్రీమియం గృహాల నిర్మాణానికే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా మార్కెట్లో మిడ్-రేంజ్ ఇళ్ల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఒకప్పుడు మార్కెట్ వాటాలో దాదాపు 30 నుంచి 40 శాతంగా ఉన్న అఫార్డబుల్ హౌసింగ్ వాటా.. ఇప్పుడు పది శాతానికి పడిపోయింది. ప్రభుత్వాలు ఎంతగా హౌసింగ్ ఫర్ ఆల్ అని నినాదాలు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో అల్పాదాయ, మధ్య ఆదాయ వర్గాలకు సరిపోయే ఇళ్లు దొరకని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ విభాగం మళ్లీ పుంజుకోవాలంటే ప్రభుత్వాల తక్షణ జోక్యం, ప్రత్యేక ప్రోత్సాహకాలు అత్యంత అవసరం. అఫార్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులకు తక్కువ ధరకే ప్రభుత్వ భూములను కేటాయించడం, జీఎస్టీ రాయితీలు ఇవ్వడం, మున్సిపల్ అనుమతుల ఫీజులను తగ్గించడం వంటి చర్యలు చేపట్టాలి. అదేవిధంగా, బ్యాంకు వడ్డీ రేట్లలో మధ్యతరగతి కొనుగోలుదారులకు ప్రత్యేక సబ్సిడీలు ఇస్తేనే ఈ రంగం మళ్లీ ఊపిరి పోసుకుంటుంది. లేనిపక్షంలో, నగరాల్లో ఎంతటి భవన నిర్మాణాలు సాగినా, అది కేవలం ధనికులకు మాత్రమే పరిమితమై.. సామాన్యుడు శాశ్వతంగా అద్దె ఇళ్లలోనే మగ్గిపోవాల్సిన దుస్థితి దాపురిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
