రూల్స్ ప్రకారమే సెక్యూరిటీ..! చంద్రబాబుకు గౌరవం తగ్గలేదన్న కేంద్ర, రాష్ట్రాలు..!

విజయవాడ విమానాశ్రయంలో చంద్రబాబును సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది సామాన్య ప్రయాణికుడిలా చెక్ చేసి పంపడం జాతీయ స్థాయిలో దుమారానికి కారణం అయింది. ధ్నాలుగేళ్లు సీఎంగా చేసిన వ్యక్తిని… వీఐపీ,జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న నేతను.. అవమానించారని.. టీడీపీ నేతలు విమర్శలు గుప్పంచారు. ఈ వ్యవహారం జాతీయ మీడియాలోనూ హైలెట్ అయింది. దీంతో.. బోర్డ్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ స్పందించింది. మాజీ సీఎంలకు విమానాశ్రయాల్లో డైరెక్ట్‌ ఎంట్రీ లేదని తెలిపింది. గవర్నర్‌, సీఎంకు మాత్రమే వీఐపీ ఎంట్రీ ఉంటుందన్నారు. జెడ్‌ప్లస్‌ కేటగిరీ భద్రతతో విమానాశ్రయానికి సంబంధం లేదని.. బోర్డ్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సమాచారం ఇచ్చింది. చంద్రబాబును అలా సాధారణ ప్రయాణికులా ట్రీట్ చేయడం… నిబంధనల ప్రకారమే జరిగిందని.. ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత..చంద్రబాబు పలుమార్లు… విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లారు. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని… హఠాత్తుగా శుక్రవారం మాత్రమే.. అలా ఎందుకు చేశారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు భద్రతపై.. కొద్ది రోజులుగా..టీడీపీ నేతలు.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఓడిపోయిన తర్వాత.. చంద్రబాబు కాన్వాయ్ నుంచి.. ఎస్కార్ట్ వాహనాన్ని తొలగించారు. అలాగే.. రూట్ క్లియరెన్స్ కూడా నిలిపివేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ అధినేత.. జడ్ ప్లస్‌ సెక్యూరిటీతో.. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ .. రక్షణ కల్పిస్తూంటారు. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వారికి రూట్ క్లియరెన్స్ ఎస్కార్ట్ ఉంటుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు.. ఎలాంటి రివ్యూ లేకుండానే… ఆ సౌకర్యాన్ని తీసేశారని.. ట్రాఫిక్‌లో చంద్రబాబు వాహనం ఎక్కడైనా ఆగితే.. రక్షణ పరంగా.. ఇబ్బంది ఎదురవుతుందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైనా ఏపీ పోలీసులు ప్రకటన చేశారు. చంద్రబాబు భద్రతలో ఎలాంటి మార్పు లేదన్నారు. ప్రోటోకాల్ ప్రకారం చంద్రబాబు కాన్వాయ్‌లోని.. అడ్వాన్స్ పైలట్ కారు మాత్రమే తొలగించామని.. రోడ్డు క్లియరెన్స్ ఎప్పటిలాగే కొనసాగుతోందని ఏపీ పోలీసులు ప్రకటించారు.

చంద్రబాబు భద్రత వివాదం ఇలా నడుస్తూండగానే.. రాష్ట్రంలో పలువురు టీడీపీ నేతల సెక్యూరిటీని ఉపసంహరించేశారు. అతి కొద్ది మందికి మాత్రమే గన్‌మెన్లను ఉంచి.. మిగతా అందరివీ ఉపసంహరించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నలుగురు టీడీపీ నేతలకు మాత్రమే భద్రత కల్పిస్తున్నారు. కోడెల శివప్రసాదరావుకు, యరపతినేని శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, బొండా ఉమామహేశ్వరరావులకు భద్రతను కొనసాగిస్తున్నారు. మాజీల్లో ఎవరెవరికి తొలగించారనే అంశంపైనే ప్రస్తుతం వివాదం ప్రారంభమైంది. క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకున్న తర్వాతే భద్రతను ఉపసంహరిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే..కక్షపూరితంగా టీడీపీ నేతలకు భద్రతను తీసేస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com