పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలన్న నారా లోకేష్ ఆలోచనను కేంద్రం స్వాగతిస్తోంది. ఇటీవల లోకేష్ ఈ అంశంపై మాట్లాడుతున్నారు.కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. స్వయంగా టీడీపీ ఎంపీ లావు ప్రైవేటు మెంబర్ బిల్లు పెట్టారు. ఈ క్రమంలో కేంద్రం సీరియస్ గా ఈ అంశంపై దృష్టి పెట్టింది. చిన్నారులు, టీనేజ్‌లో ఉన్న వారిపై సోషల్ మీడియా ప్రభావం పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం వయసు ఆధారిత పరిమితులను విధించాలని యోచిస్తోంది.
ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇప్పటికే ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వంటి దేశాలు చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నాయని, భారత్ కూడా అదే దిశగా అడుగులు వేస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రాథమిక సంప్రదింపుల దశలో ఉంది. దీనిపై వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ముఖ్యంగా డీప్‌ఫేక్‌లు, వయసు ఆధారిత నియంత్రణలను ఎలా అమలు చేయాలనే దానిపై టెక్ కంపెనీల అభిప్రాయాలను సేకరిస్తున్నారు.
బడ్జెట్ సందర్భంగా సమర్పించిన ఆర్థిక సర్వేలో కూడా డిజిటల్ అడిక్షన్ ను తగ్గించేందుకు ఇలాంటి నియంత్రణలు అవసరమని సూచనలు వచ్చాయి. సోషల్ మీడియా వల్ల కలిగే మానసిక ఒత్తిడి, సైబర్ వేధింపుల నుంచి చిన్నారులను రక్షించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. ఒకవేళ ఈ నిబంధనలు అమలులోకి వస్తే, నిర్దేశిత వయసు కంటే తక్కువ ఉన్నవారు సోషల్ మీడియా ఖాతాలను తెరవడానికి లేదా వినియోగించడానికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి కావచ్చు.